ఏపీలో మళ్లీ బీజేపీ మార్కు కల్లోలం

ఆ మధ్య ఆలయాల్లో దొంగలు పడుతున్నారని, రథాలు తగలబెడుతున్నారని, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారంటూ ఏపీలో బీజేపీ పెద్ద హడావిడి చేసింది. కట్ చేస్తే, అప్పట్లో వారి పప్పులు ఉడకలేదు, ప్రశాంతంగా ఉన్న ఏపీలో మత…

ఆ మధ్య ఆలయాల్లో దొంగలు పడుతున్నారని, రథాలు తగలబెడుతున్నారని, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారంటూ ఏపీలో బీజేపీ పెద్ద హడావిడి చేసింది. కట్ చేస్తే, అప్పట్లో వారి పప్పులు ఉడకలేదు, ప్రశాంతంగా ఉన్న ఏపీలో మత కల్లోలం సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు మరోసారి అలాంటి నీఛపు ఆలోచనలే చేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు.

కర్నూలు జిల్లా ఆత్మకూరులో రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టారు. ఓ మసీదు నిర్మాణం విషయంలో రచ్చ రాజుకుంది. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జ్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఈ వ్యవహారంలో కీలకంగా మారారు. ఆయన కారు తగలబడిందని, దాడిలో ఆయనకు గాయాలయ్యాయని కూడా చెబుతున్నారు. అయితే మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్వయంగా ఏపీ డీజీపీ ఈ విషయంలో వార్నింగ్ ఇచ్చారు.

ఓట్ల కోసం ఇంత నీఛమా..?

ఏపీలో ప్రస్తుతానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో అధికారంలోకి రావడం అసాధ్యం అని టీడీపీ కూడా డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఆ ఓటులో షేర్ ఆశించడం మరింత అత్యాశే అవుతుంది. దీంతో బీజేపీ మతాన్ని హైలెట్ చేయాలనుకుంటోంది. 

హిందూ ఓట్లను ఒడిసి పట్టుకోడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఉత్తరాదిలో చేస్తున్నట్టు ఇక్కడ కూడా రచ్చ మొదలు పెట్టింది.

చీప్ లిక్కర్ కవరింగ్ కోసం ఎన్ని చీప్ పాట్లో..

చీప్ లిక్కర్ 50 రూపాయలకే ఇస్తామంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో ఏపీలో బీజేపీకి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. అందుకే వారు డైవర్షన్ గేమ్ మొదలు పెట్టారు. ఇలా ఇతర విషయాలను హైలెట్ చేస్తూ జిన్నా టవర్, కేజీహెచ్ ఆస్పత్రి అంటూ హడావిడి చేస్తున్నారు. ఇందులో భాగమే ఆత్మకూరులో మసీదు నిర్మాణ విషయంలో జరిగిన గొడవ. వెంటనే డీజీపీ స్పందించడం, ఎస్పీని అక్కడకు వెళ్లి పరిస్థితి సమీక్షించాలని ఆదేశించడం జరిగిపోయాయి.

పోలీసులు అలర్ట్ గా ఉండటంతో ఆత్మకూరులో బీజేపీ పాచిక పారేలా కనిపించడం లేదు. అయితే బీజేపీ లాంటి అతివాద పార్టీని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎన్నికల టైమ్ కి ఎలాగోలా ఏపీలో అల్లకల్లోలం సృష్టించి ఓటుబ్యాంకుని పెంచుకోవడమే కాషాయదళం పని.