గతంలో తాము అనుకున్నది సాధించేందుకు ఎవరైనా నిరసన చేపట్టారు అంటే.. రోడ్డుపై కూర్చోవడం, నిరాహార దీక్షలు చేయడం, విధులకు హాజరు కాకపోవడం చేసేవారు. లైటర్ వే లో.. అంటే కనీసం నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని డ్యూటీలు చేయడం.. ఇలా ఉండేది నిరసన కార్యక్రమాల స్వరూప స్వభావం.
మొన్నటి వరకూ పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా ఇదే తరహా నిరసనలు తెలియజేశారు. కానీ సోషల్ మీడియా కాలంలో నిరసనల రూపు రేఖలు కూడా మారిపోయాయి. నిన్నటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ ప్రొబేషన్ డిక్లేర్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారంటూ మరో కొత్త స్టైల్ కి తెరతీశారు. వాట్సప్ గ్రూప్స్ నుంచి లెఫ్ట్ అవుతున్నారు.
ఇదెక్కడి కామెడీ…
వాట్సప్ గ్రూప్స్ నుంచి లెఫ్ట్ అయితే ఏమవుతుంది? అసలిలాంటి ఐడియా ఎవరికి వచ్చింది. పోనీ లెఫ్ట్ అయితే సమాచారం కోసం మిగతా వారిని అయినా ఎంక్వయిరీ చేయాలి కదా, పోనీ వాట్సప్ లేదు. ఉన్నతాధికారులు ఫోన్ కాల్ చేసి కానీ, మెసేజ్ ల రూపంలో కానీ ఆదేశాలివ్వొచ్చు కదా. వాటిని పాటించ కూడదు అనుకుంటే.. గ్రూపుల్లో ఉండి కూడా తమ నిరసన తెలియజేయొచ్చు. కానీ సచివాలయ ఉద్యోగులు ఈ వెరైటీ నిరసనతో హల్ చల్ చేస్తున్నారు.
సోషల్ మీడియా యుగంలో అన్నీ వాట్సప్ తో అనుసంధానమై ఉన్నాయి. ఏ అధికారి అయినా సిబ్బందికి సమాచారం ఇవ్వాలంటే సింపుల్ గా రేపు మీటింగ్ అంటూ అర్థరాత్రి అయినా సరే వాట్సప్ గ్రూప్ లో మెసేజ్ పెడతారు. అది చూసి సిబ్బంది హడలిపోయి తెల్లారగేనే ఫస్ట్ ప్రయారిటీ మీటింగ్ కి ఇస్తారు. కానీ గ్రూపుల నుంచి లెఫ్ట్ అయితే మీటింగ్ లు, ఇతర కార్యక్రమాలకు ఎగ్గొట్టొచ్చనేది వారి ఆలోచన కావొచ్చు. ప్రస్తుతం గ్రూపుల నుంచి బయటికొచ్చిన వారిని బతిమిలాడే ప్రక్రియ మొదలైంది.
పీఆర్సీతోనే ప్రొబేషన్ గుర్తొచ్చిందా..?
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పీరియడ్ కి టైమ్ గడిచిపోయి 3 నెలలు కావస్తోంది. వాస్తవానికి వారు నిరసన తెలియజేయాలంటే ఈ మూడు నెలల్లో ఎప్పుడో ఓ సారి రోడ్లపైకి రావొచ్చు. కానీ పీఆర్సీప్రకటన తర్వాతే సచివాలయ ఉద్యోగుల్లో చురుకు పుట్టింది.
తమతోపాటు సచివాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. అదే సమయంలో వారితోపాటు పనిచేసే తమకు మాత్రం ప్రొబేషన్ డిక్లేర్ కాదు, జీతాలు పెరగవు. దీంతో వారంతా వాట్సప్ నిరసన మొదలు పెట్టారు. సోమవారం నుంచి విధులకు కూడా హాజరు కాకూడదనుకుంటున్నారు. ఈ లెక్క ఎప్పటికి తేలుతుందో చూడాలి.