పెద్ద వాళ్లు తింటే ఫలహారాలు. చిన్నవాళ్లు తింటే చిరుతిళ్లు అన్న సామెత ఊరికనే పుట్టలేదు. చంద్రబాబు చేస్తే అది మహా అధ్భుతం. వేరే వాళ్లు చేస్తే తప్పిదం. ఇలాగే వుంటుంది ఎల్లో మీడియా వ్యవహారం. వేజ్ రివిజన్ సజావుగా జరిగిపోయింది. ఉద్యోగుల్లో అసంతృప్తి రగులుకుంటుందేమో అన్న ఆశతో వేచి వున్నవారికి నిరాశ ఎదురయింది. ఇంకేం చేయాలో అన్న రంధ్రాన్వేషణ మొదలయింది.
రెండేళ్ల పాటు పదవీవిరమణ వయస్సు పెంచారు ఉద్యోగులు హ్యపీగా వున్నారు. పిల్లలు సెటిల్ అయిపోయి మనవలు వచ్చినా తమ సంపాదన తమకు వుంటుందన్న ఆనందం. పిల్లలకు కూడా తల్లి తండ్రుల బాధ్యత భరించాల్సిన అవసరం లేకపోవడం. అందువల్ల ఇక్కడ కూడా నెగిటివ్ రాయడానికి చాన్స్ దొరకలేదు.
అందుకే వేరే రూట్ లో వచ్చారు. పదవీ విరమణ వయస్సు పెంచడం వల్ల పాతికలక్షల మంది నిరుద్యోగులు నిరాశ పడుతున్నారట. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వీరు దిగాలు పడుతున్నారట. నిజానికి ఇప్పడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూసేవారి సంఖ్య తగ్గిపోయింది. అయితే టీచర్లు, లేకుంటే పోలీసులు తప్ప వేరే ఉద్యోగాలు పెద్దగా లేవు. పైగా కొత్తగా చేరిన వారికి పింఛను సదుపాయం కూడా లేదు.
పైగా ఫలానా ఉద్యోగం కావాలి అనుకుంటే తప్ప నిరుద్యోగం అన్న పదం లేదు. అనేక కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి. కానీ ఏదో తమ బాధ ఎలాగోలా వ్యక్తం చేయాలి అనే యావలో పడి అసలు విషయం మరిచిపోతోందీ ఎల్లో మీడియా.
గతంలో 58 ఏళ్లు వున్నదానిని 60 ఏళ్లు చేసింది తమ చంద్రబాబే. అప్పుడూ నిరుద్యోగులు వున్నారు. మరి అప్పుడు ఎందుకు ఇలాంటి వార్తలు వండి వార్చలేదో? చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే చాలా హాయిగా వుంటుందేమో?