టీడీపీ అధినేత చంద్రబాబులో ప్రేమ కోణం కూడా ఉందనే విషయం కుప్పం పర్యటనతో తెలిసొచ్చింది. కాలేజీ కుర్రాడిలా పవన్ కల్యాణ్‌కు రాజకీయ ప్రేమ ప్రతిపాదన చేయడం ఆసక్తికర పరిణామం. జనసేనతో పొత్తు కుదుర్చుకోడానికి సిద్ధమనే సంకేతాల్ని వినూత్నంగా ప్రేమ కోణంలో పంపడం విశేషం. బాబులో సరస ముఖం కూడా ఉందని కుప్పం పర్యటన తెలియజేసింది.
ఎన్నికల్లో పొత్తులనేవి సర్వసాధారణం. అందులోనూ చంద్రబాబుకు, పొత్తులకు అవినాభావ సంబంధం ఉంది. పొత్తులేకపోతే ఆయన పార్టీ చిత్తే అనే సెంటిమెంట్ ఉండనే ఉంది. ఇది సెంటిమెంటే కాదు, వాస్తవం కూడా. ఈ విషయాన్ని 2019 సాధారణ ఎన్నికలు రుజువు చేశాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు టీడీపీకి చావుబతుకుల సమస్య. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపనేది మరీ ముఖ్యంగా చంద్రబాబు వారసుడికి చాలా అవసరం.
తన వయసు పైబడుతుండడం, బహుశా ఇవే చివరి ఎన్నికలనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇదొక్కసారి ఒక్క అవకాశం ఇవ్వాలనే పిలుపుతో ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అయినప్పటికీ బలమైన ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడం తనొక్కడి వల్ల సాధ్యం కాదనే ఆందోళన బాబును వెంటాడుతోంది. అందుకే జనసేనాని పవన్‌కల్యాణ్‌తో పొత్తు కుదుర్చుకునేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారు.
పవన్‌కల్యాణ్‌పై కంటే ఆయన వెనకున్న కాపు సామాజిక వర్గం ఓట్లపైనే చంద్రబాబుకు వల్లమాలిన ప్రేమ అనేది బహిరంగ రహస్యమే. రాజకీయాల్లో తమ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీగా జనసేనను కాపులు భావిస్తున్నారు. అందుకే జనసేనతో పొత్తు కుదుర్చుకుంటే గంపగుత్తగా కాపుల ఓట్లను పొందొచ్చని చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
కుప్పం పర్యటనలో భాగంగా పొత్తు ప్రతిపాదనను చంద్రబాబు పంపారు. ఈ విషయమై జనసేనాని మనసులో ఏముందో ఇంకా వెల్లడి కాలేదు. కానీ పొత్తుకు నో అని చెప్పకపోవడంతో పవన్‌పై టీడీపీ ఆశలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బాబు అడిగితే నో అని పవన్ చెప్పడనే నమ్మకం టీడీపీ నేతల్లో ఉంది. జనసేనతో పొత్తు కుదుర్చుకుంటే, అదే పెద్ద విజయంగా టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ ఊ కొడతాడా, లేక ఊహూ అంటాడా? అనే సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు తమకు పవన్ విడాకులు ఇస్తాడా? అనే అనుమానం బీజేపీని కలవరపెడుతోంది.
టీడీపీతో ప్రేమ, బీజేపీతో విడాకులు…ఈ రెండు విషయాలపై పవన్ సీరియస్‌గా ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతోంది. బీజేపీతో విడాకులు తీసుకోవాలంటే అందుకు బలమైన కారణాన్ని వెతుక్కోవాల్సి ఉంది. అలాగే టీడీపీతో కొత్త ప్రయాణం మొదలు పెట్టడానికి కూడా సరైన కారణాన్ని చెప్పాల్సి వుంటుంది. ఇంతకూ పవన్ ఆలోచన ఎటు వైపు? అనేది అందరి మనసులను వేధిస్తున్న ప్రశ్న.