కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విషయమై ప్రపంచ మీడియా కూడా ప్రాధాన్యంతో కూడిన కథనాలు రాసింది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌లో అమలవుతున్న ప్రజాస్వామ్య ధోరణులపై పలువురు ప్రముఖులు విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన అమెరికా చట్టసభ సభ్యుడు రో ఖన్నా ట్విటర్ వేదికగా చేసిన కామెంట్స్ చర్చనీయాంశ మయ్యాయి. ఆయన పూర్వీకులు భారత స్వాతంత్ర్య సమరయోధులు కావడంతో రో ఖన్నా మాటలకు విలువ వచ్చింది. రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై రో ఖన్నా స్పందన ఏంటంటే…
“రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై వేటు వేయడం గాంధీ సిద్ధాంతాలకు, భారతదేశ విలువలకు తీవ్ర ద్రోహం చేయడమే. స్వాతంత్ర్య పోరాటంలో మా తాత సంవత్సరాల తరబడి జైలు జీవితం గడిపింది ఇలాంటి ప్రజాస్వామ్యం కోసం కాదు. దేశ ప్రజాస్వామ్యం కోసం ఇలాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అధికారం మీకు వుంది” అంటూ ప్రధాని మోదీని ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా న్యూయార్క్ టైమ్స్‌లో రాహుల్‌పై అనర్హత వేటు వేయడానికి సంబంధించిన కథనాన్ని షేర్ చేశారు.
రో ఖన్నా పూర్వీకులు ఎవరో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. రో ఖన్నా తాత అమర్నాథ్ విద్యాలంకార్. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్‌తో కలిసి అమర్నాథ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కొన్నేళ్లు ఆయన జైలు జీవితం గడిపారు. ఈయన పంజాబ్‌కు చెందిన నాయకుడు. స్వాతంత్ర్యానంతరం లోక్‌సభ సభ్యుడిగా సేవలందించారు. పంజాబ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు.