టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర శనివారానికి 50వ రోజుకు చేరింది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గానికి చేరుకుంది. పాదయాత్రపై టీడీపీ శ్రేణులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో లోకేశ్ యువగళం పాదయాత్రకు యువ హీరో, ఆయన తమ్ముడైన నారా రోహిత్ సంఘీభావం ప్రకటించడం గమనార్హం.
ఈ సందర్భంగా రోహిత్ రాజకీయాలు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఆత్మరక్షణలో పడిందన్నారు. అందుకే టీడీపీపై బురదజల్లుతోందని విమర్శించారు. యువగళం పాదయాత్ర రానున్న రోజుల్లో ప్రభంజనం రేపుతుందన్నారు. రాజకీయాల్లోకి యువత రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పుకొచ్చారు. అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని హీరో రోహిత్ అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంపై రోహిత్ మాట్లాడ్డం ఆశ్చర్యంగా ఉందని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. పాదయాత్రలో భాగంగా తిరుపతిలో లోకేశ్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నానన్నారు. సమాజ శ్రేయస్సు కోరేవారెవరైనా రాజకీయాల్లోకి రావచ్చన్నారు. లోకేశ్ కామెంట్స్‌పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
2009లోనే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారని గుర్తు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలోకి ఆయన్ను లోకేశ్ ఆహ్వానించడం ఏంటనే నిలదీతలు వెల్లువెత్తాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్ యాక్టీవ్ అయ్యారని, అంతకు ముందు ఎక్కడున్నారని జూ.ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నించారు. తాజాగా లోకేశ్ అభిప్రాయాల్నే తమ్ముడైన రోహిత్ వ్యక్తం చేశారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు లోకేశ్, ఆయన తమ్ముడు రోహిత్ రాజకీయ పాఠాలు చెప్పడం నవ్వు తెప్పిస్తోందని వెటకరిస్తున్నారు.