Advertisement

Advertisement


Home > Politics - Opinion

నియంతృత్వ పోకడలకు చిరునామా బివి రాఘవులు!

నియంతృత్వ పోకడలకు చిరునామా బివి రాఘవులు!

ఆయన చిరిగిన బనీయన్‌ వేసుకుంటారు. భుజానికి బ్యాగు తగిలించుకుంటారు. సైకిల్‌ తొక్కుతూ కనిపిస్తారు. ఆటోలోనో, బైక్‌పైనో ప్రయాణిస్తూ దర్శనమిస్తారు. ఆయన్ను చూసిన వారంతా....అంత పెద్ద నాయకుడు ఎంత సింపుల్‌గా వున్నాడో....చూడండి అంటూ అభినందిస్తుంటారు. ఆయన సింప్లిసిటీ గురించి పత్రికల్లో ఇటువంటి కథనాలు అనేకం ప్రచురితమయ్యాయి. టీవీల్లో ప్రసారమయ్యాయి. ఇదంతా ఎవరి గురించి అంటే... సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఒకప్పటి రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు గురించి.

ఇది బివి రాఘవులు బయటకు కనిపించే రూపం మాత్రమే. ఆయన అంతర రూపంలో మరోలా వుంటుంది. ఎవరూ ఊహించినంత వికృతంగా వుంటుంద‌ని సీపీఎం సానుభూతిప‌రులే విమ‌ర్శిస్తుంటారు. ఈ అంతర్గత రూపం గురించి....పార్టీలోని ఉన్నత స్థాయిలో తప్ప కింది స్థాయి కార్యకర్తలకూ పెద్దగా తెలియదనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సాధారణ జనంలాగే కార్యకర్తలూ బివి రాఘవులను కమ్యూనిస్టు పార్టీలోని గాంధీ మహాత్ముడు అని అనుకుంటుంటారు. ఆయన పైకి కనిపించేంత సౌమ్యుడు కాడు. నియతృత్వ పోకడలను నిలువెల్లా నింపుకున్న ‘నాయకుడు’ అని సొంత పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘాటు విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

బివి రాఘవులు సిపిఎం పొలిట్‌ బ్యూరో పదవికి రాజీనామా చేసినట్లు వార్తలొచ్చిన నేపథ్యలో ఆయన వ్యవహారం సిపిఎంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పార్టీ జాతీయ కార్యదర్శి అవుతారని ప్రచారంలో వున్న బివి రాఘవులు అక‌స్మాత్తుగా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న సంశయం సిపిఎం శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ తరుణంలో ఆయన వ్యవహార శైలి గురించి సిపిఎం శ్రేణులు అందించిన సమాచారం ఇది.

ఇటీవల కాలంలో పలువురు జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పార్టీని విడిచిపెట్టారు. జిల్లా కమిటీ స్థాయిలోనైతే చెప్పాల్సిన పనిలేదు. పార్టీని వదులుకున్నవారు వందల సంఖ్యలోనే వుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సిపిఎం ఛిన్నాభిన్నం అయిపోడానికి ప్రధాన కారకుడు బివి రాఘవులే అనేది సిపిఎం వ్యహారాలు లోతుగా తెలిసిన వారు చెబుతున్నమాట.

రెండు తెలుగు రాష్ట్రాలకు బివి రాఘవులు కేంద్ర కమిటీ నుంచి గైడ్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాలైనా, రాష్ట్ర కమిటీ సమావేశాలైనా బివి రాఘవులు గైడెన్స్‌లోనే జరుగుతుంటాయి. రాష్ట్ర నాయకత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడమే ఆయన పని. అయితే...తానే కార్యదర్శిలాగా వ్యవహరిస్తారన్నది ఆయన మీద వున్న ప్రధానమైన అభియోగం. తాను ఏది అనుకుంటే అది జరిగి తీరాల్సిందే. రాష్ట్ర కార్యదర్శిగా ఎవరుండాలో రాఘవులే నిర్ణయిస్తారు. రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఎవరుండాలో కూడా ఆయనే నిర్ణయిస్తారు. తనకు నచ్చితే ఎంతటి అసమర్ధుడినైనా ఆయన నాయకత్వ బాధ్యతల్లో ప్రతిష్టిస్తారు. తనకు నచ్చకుంటే, తనకు ఎదురుచెబితే ఎంతటి సమర్ధ నాయకుడినైనా పక్కకు నెట్టేస్తారు. తొక్కిపెట్టేస్తారు. క్రమశిక్షణ పేరుతో మెల్లగా పార్టీ నుంచి సాగనంపుతారు. అలా బివి రాఘవులు పంతానికి బలైన నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందరున్నారో చెప్పలేం.

రాఘవులు నియంతృత్వానికి ఒక ఉదాహరణ. రాఘవులు అప్పుడు రాష్ట్రం కేంద్రంగా పని చేస్తున్నారు. ఒక జిల్లా మహాసభకు పరిశీలకుడిగా హాజరయ్యారు. జిల్లా కార్యదర్శిగా తన అనుంగు శిష్యుడైన ఒకరిని రాఘవులు ప్రతిపాదించారు. అతని కన్నా సీనియర్‌గా వున్న నాయకులు తాము కార్యదర్శిగా వుంటామంటూ పట్టుబట్టారు. ఆ సమయంలో రాఘవులు కేకలు వేశారు. "నేను చెప్పేది అర్థం కాలేదు....ఆయనే (తను ప్రతిపాదించిన వ్యక్తి) కార్యదర్శిగా ఉంటారు. అలా కాదని పోటీ చేసి ఎన్నికల దాకా వెళితే...మీరు నాశనమైపోతారు" అంటూ శాపనార్ధాలు పెట్టారు. అయినా సదరు వ్యక్తి పోటీకి సిద్ధపడ్డారు. ఆఖరికి రాఘవులు ప్రతిపాదించిన వ్యక్తి ఓడిపోయారు. పోటీపడిన వ్యక్తి గెలిచి కార్యదర్శి అయ్యారు.

దీంతో రలిగిపోయిన రాఘవులు రాష్ట్ర మహాసభల్లో తన కసిని, కోపాన్ని తీర్చుకున్నారు. సాధారణంగా జిల్లా కార్యదర్శులు రాష్ట్ర కమిటీలో ఉంటారు. అయితే తనకు ఎదురు తిరిగి, పోటీచేసి, గెలిచి జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన వ్యక్తిని రాష్ట్ర కమిటీలోకి తీసుకోలేదు. జిల్లా కార్యదర్శిగా ఓడిపోయిన వ్యక్తిని రాష్ట్ర కమిటీకి ఎంపిక చేశారు. జిల్లా కార్యదర్శిని పక్కనపెట్టి మరొకరిని రాష్ట్ర కమిటీలోకి తీసుకోవడం మునుపెన్నడూ జరగలేదు. బివి రాఘవులు నియంతృత్వం అలా వుంటుంద‌ని చెబుతుంటారు. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ప్రతి జిల్లాలోనూ ఇటువంటి అనుభవాలు నాయకులకు ఉన్నాయి.

పార్టీ జాతీయ కేంద్రమైన ఢిల్లీకి వెళ్లిన తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీలకు రాఘవులు గైడ్‌ అయ్యారు. అంత ఉన్నత స్థానానికి వెళ్లిన తరువాత కూడా ఆయన ధోరణిలో మార్పు రాలేదు. ఆ మధ్య జరిగిన రాష్ట్ర మహాసభల్లో కర్నూలు మాజీ ఎంఎల్‌ఏ గఫూర్‌ను కాదని వి.శ్రీనివాసరావును కార్యదర్శిని చేశారు. అదే విధంగా కీలకమైన కార్యదర్శి వర్గంలోకి తనకు అనుకూలంగా వున్న వారిని మాత్రమే తీసుకుని, తనను ధిక్కరిస్తారనుకున్న వారిని పక్కనపెట్టేశారు. అక్కడి నుంచి ముసలం మొదలయింది.

బివి రాఘవులు వ్యవహార శైలితో విసిగిపోయిన పలువురు నాయకులు ఆధారాలతో సహా జాతీయ నాయకత్వానికి లేఖలు రాసినట్లు సమాచారం. కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్‌ కూడా రాఘవులు తీరును పలుసార్లు రాష్ట్ర కమిటీలోనూ ఈ అంశాలను లేవనెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల గైడెన్స్‌ కోసం రాఘవులుతో పాటు కేరళకు చెందిన మంత్రి ఎంఏ బేబీని పంపడం మొదలుపెట్టారు. దీంతో రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో, రాష్ట్ర కమిటీ సమావేశాల్లో రాఘవులు అసలు రూపం మెల్లమెల్లగా బహిర్గమవుతూ వచ్చింది. ఆయన నియంతృత్వ ధోరణి, ఏకపక్ష నిర్ణయాలతో పార్టీ ఏ విధంగా నాశనమైపో తున్నదో జాతీయ నాయకత్వానికి తెలిసిపోయింది. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా అస్త్రాన్ని సంధించారు. తనపై చర్యలు తప్పవని అర్థమైన నేపథ్యంలోనే రాఘవులు రాజీనామా నాటకం మొదలుపెట్టారని ఆయన గురించి తెలిసిన సిపిఎం శ్రేణులు అంటున్నాయి.

కమ్యూనిస్టు పార్టీకి కేంద్రకృత ప్రజాస్వామ్యం గుండెకాయి వంటిదని చెబుతారు. అందరూ ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవడం, సమావేశాల్లో స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పడం, మెజారిటీకి మైనారిటీ కట్టుబడి వుండటం, సమావేశం నిర్ణయాన్ని సమ‌ష్టిగా అమలు చేయడం వంటివి కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలు. రాఘవులు సమావేశానికి హాజరైతే వీటికి విలువ వుండదు. ఆయన ఏమి చెబితే అది చేయాలి. ఎలా చెబితే అలా చేయాలి. ఎవరూ మారు మాట్లాడటానికి లేదు. రాఘవులును ధిక్కరించిన వారు ఇక పార్టీలో వుండరన్నది బహిరంగ రహస్యం. అలాంటి వారు మూడు నెలలా, ఆర్నెల్లా అంతే...ఏదో ఒకరోజు బయటకు నడవాల్సిందే.

ఈ పరిస్థితుల్లో పొలిట్‌ బ్యూరోకు రాఘవులు రాజీనామా చేయడం శుభపరిణామమని సిపిఎం శ్రేణులు అంటున్నాయి. ఇది పార్టీకి మేలు జరిగే పరణామమే తప్ప నష్టం జరిగేది కాదని అంటున్నాయి. ఇప్పటికైనా రాఘవుల నిజ రూపాన్ని జాతీయ నాయకత్వం అర్థం చేసుకుని, ఆయన్ను కీలక బాధ్యతల నుంచి తప్పిస్తే తప్ప తెలుగు రాష్ట్రాల్లో సిపిఎం అస్థిత్వాన్నైనా కాపాడుకోలేమని సిపిఎం నాయకులు చెబుతున్నారు. అవినీతి, బంధుప్రీతి, వినియోగదార సంస్కృతికి దూరంగా వుండటమే కాదు....పదవీ కాంక్ష లేకపోవడం, కార్యకర్తల అభిప్రాయాలకు విలువనివ్వడం, ప్రజాతంత్రయుతంగా కమిటీలు నడపడం కూడా కమ్యూనిస్టు ప్రమాణాల్లో భాగమే. అయితే...ఈ కోణంలో రాఘవులు పూర్తిగా విఫలమయ్యారని, దీనివల్ల పార్టీకి తీరని నష్టం వాట్లిందని సిపిఎం శ్రేణులు వేదనతో చెబుతున్నాయి.

-పి.ఝాన్సీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?