ఖష్బూ…సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు. ఇటీవల జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు. తమిళనాడుకు చెందిన ఖుష్బూ సుందర్ 2018లో కాంగ్రెస్ నాయకురాలిగా ప్రధాని మోదీపై ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిపక్షాలకు ఖుష్బూ ట్వీట్ ఓ ఆయుధమైంది. మోదీ ఇంటి పేరుపై రాహుల్‌గాంధీ గతంలో చేసిన ఘాటు విమర్శలు, ఆయన పదవికి ఎసరు తెచ్చిన సంగతి తెలిసిందే.
మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, పరువు నష్టం కేసులో దోషిగా సూరత్ కోర్టు తేల్చడం, రెండేళ్ల జైలు శిక్ష విధించడం తదితర పరిణామాల గురించి అందరికీ తెలిసినవే. ఇదిలా వుండగా గతంలో మోదీపై ఖుష్బూ చేసిన ట్వీట్ పరిశీలిస్తే… ఘోరంగా వుంది. రాహుల్ పరుష వ్యాఖ్యలు ఏపాటి అనే భావన ఎవరిలోనైనా కలగకుండా వుండదు.
‘ఇక్కడ మోదీ.. అక్కడ మోదీ.. ఎక్కడ చూసినా మోదీనే. అసలేంటి ఇది? ప్రతి మోదీ వెనుక భ్రష్టాచార్ (అవినీతి) అనే ఇంటి పేరు పెట్టాలి. మోదీ అంటేనే అవినీతి. అవినీతికి బదులు మోదీ అనే పేరు మార్చేద్దాం. ఈ పేరే సరైంది. నీరవ్, లలిత్, నమో = అవినీతి’ అంటూ 2018లో కాంగ్రెస్ నాయకురాలిగా ఖుష్బూ ట్వీట్ చేశారు. 2020లో ఖుష్బూ బీజేపీలో చేరారు.
గతంలో ఆమె చేసిన ట్వీట్‌ను కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ వైరల్ చేస్తుండడం గమనార్హం. ఖుష్బూపై చర్యలు తీసుకునే దమ్ముందా? అని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఖుష్బూపై పరువు నష్టం కేసు వేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ఖుష్బూ బీజేపీలో ఉన్నారని, రాజ్యాంగ పదవి అయిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కొనసాగుతున్నారని గుర్తు చేస్తూ దెప్పి పొడుస్తున్నారు.