ఆనం రామనారాయణ రెడ్డి వయసు 70 సంవత్సరాలు. మేకపాటి చంద్రశేఖర రెడ్డి వయసు 71 సంవత్సరాలు! దశాబ్దాల రాజకీయ నేపథ్యం, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా పేరు ప్రఖ్యాతులు! పెద్దపెద్ద పదవులు చూసిన నేపథ్యమూ ఉంది. ఒక దశలో అయితే ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారనే ఊహాగానాలు కూడా రేగాయి. కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించి కాంగ్రెస్ అధిష్టానం ఆనం రామనారాయణ రెడ్డిని సీఎంగా చేయబోతోందనే వార్తలు వచ్చాయప్పట్లో!
మరి ఇంత నేపథ్యం ఉండి.. ఇలా అవమానకరమైన రీతిలో సస్పెన్షన్ వేటు వేయించుకోవడం రామనారాయణ రెడ్డికి కానీ, మేకపాటికి కానీ తగిన పనా? ఈ వయసులో ఈ చర్యలతో వీరు తమ వ్యక్తిత్వాన్ని ఏం చాటుకుంటున్నట్టు? సస్పెన్షన్… వీరి రాజకీయ నేపథ్యానికి ఇంతకు మించిన అవమానం లేదు! ఇంతేనా.. 70 యేళ్ల వయసు, దశాబ్దాల రాజకీయ అనుభవం వీరికి నేర్పింది ఈ దిశగా పయనించడమేనా!
సస్పెన్షన్ -అవమానం అనే కోణంలో కోటంరెడ్డినో, శ్రీదేవినో చేర్చడం లేదు. ఎందుకంటే… వారి రాజకీయ ఎదుగుదల, నేపథ్యం మరీ చెప్పుకోవాల్సినంతవేమీ కావు! వారికి ఇది తుడిచేసుకుంటే పోయేదే!
రాజకీయ నేతలంటే సిగ్గూ, శరం వదిలేసిన వాళ్లు అనే అభిప్రాయం ప్రజల్లో గట్టిగా ఉంది. మరి ఆ అభిప్రాయాలు ఊరికే ఏర్పడినవేమీ కావు! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కానీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కానీ ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి వంటి వారు విబేధించవచ్చు! అదేమీ నేరం కాదు. అయితే ఆ విబేధించే తీరు తమ వయసుకు, అనుభవించిన హోదాలకూ తగ్గట్టుగా ఉండి ఉంటే..అది కదా పరిణతి! జగన్ తీరు నచ్చలేదు..అందులో తప్పేం లేదు. అలాంటప్పుడు డైరెక్టుగా రాజీనామాను ప్రకటించి ఉంటే?
తను ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ఇదే ఆనం ప్రకటించి ఉంటే.. అది కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని ప్రకటించి ఉంటే..? అది కదా హీరోయిజం! మేకపాటి చంద్రశేఖర రెడ్డి చాలా సార్లు చెప్పారు.. వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లనే తమకంటూ ఒక గుర్తింపు, నేపథ్యం వచ్చిందని! మరి జగన్ కూడా చంద్రశేఖర రెడ్డికి వరసగా టికెట్ ఇస్తూ వచ్చారు కదా! 2014లో ఓడిపోయినా, 2019లో టికెట్ నిరాకరించలేదు కదా! నియోజకవర్గం స్థాయిలో గత కొన్నాళ్లుగా చాలా వ్యవహారాలు మేకపాటికి వ్యతిరేకంగానే ఉన్నాయి. మేకపాటి స్థానంలో తన తనయుడికి టికెట్ అంటూ కొన్నాళ్ల కిందట ఒక మహిళా నేత హల్చల్ చేసింది కూడా!
ఇప్పుడు ఆనం, మేకపాటి ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీలో చేరతారా! లేదా బీజేపీలోకా! లేక ఈ వయసులో అన్ని పదవులూ చూసి.. పవన్ కల్యాణ్ కు జై అంటూ తిరుగుతారా! ఆనం రామనారాయణ రెడ్డి ఆల్రెడీ ఒకసారి తెలుగుదేశం పార్టీలోకి చేరి మళ్లీ బయటకు వచ్చిన వారే కదా! అక్కడ దిక్కూదివాణం లేదనే ఇక్కడ చేరారు. ఇక్కడా ఆయన అవమానంగా ఫీలయ్యారు. అయితే అవమానం అనేది ఆయన ఫీలయ్యే అంశాల్లో కన్నా.. వ్యవహారాన్ని సస్పెన్షన్ వరకూ తీసుకొచ్చుకోవడమే అసలైన అవమానం!
ఇంత బతుకూ బతికి.. సస్పెండ్ చేయించుకుని బయటకు రావడం సగటు మనిషికి అయితే తట్టుకోలేని అంశం. అయితే ఆనం, మేకపాటి లాంటి వాళ్లు ఇలా ఫీల్ కావడం లేదు! ఈ వయసులో కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పార్టీ కోసం వారు ఇక పాకులాడుకోవడంలో బిజీగా ఉండొచ్చు!