ఏనాడో ప‌రువు పోయింది…ఇంకా ఏం మిగిలింది?

కుప్పం టీడీపీ నాయ‌కుల్ని తిట్టిన‌ట్టే …లోకేశ్‌కు కూడా చంద్ర‌బాబు ఇట్లే క్లాస్ తీసుకుని ఉంటాడా? అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. కుప్పం మున్సిపాలిటీతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలోని స‌ర్పంచ్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో టీడీపీ తుడిచి పెట్టుకుపోయిన సంగ‌తి…

కుప్పం టీడీపీ నాయ‌కుల్ని తిట్టిన‌ట్టే …లోకేశ్‌కు కూడా చంద్ర‌బాబు ఇట్లే క్లాస్ తీసుకుని ఉంటాడా? అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. కుప్పం మున్సిపాలిటీతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలోని స‌ర్పంచ్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో టీడీపీ తుడిచి పెట్టుకుపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో కుప్పంలో చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఈ నేప‌థ్యంలో కుప్పం నియోజ‌క వ‌ర్గంలో త‌ర‌చూ ప‌ర్య‌టించేందుకు చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. ఏ మాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించినా అస‌లుకే ఎస‌రు వ‌చ్చేలా ఉంద‌నే వాస్త‌వాన్ని చంద్ర‌బాబు గ్ర‌హించారు.

ఇందులో భాగంగా తాజాగా ఆయ‌న కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. కుప్పం నియోజ‌క వ‌ర్గంలోని టీడీపీ నాయ‌కుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో చంద్ర‌బాబు కీల‌క కామెంట్స్ చేశారు. త‌న ప‌రువు తీశార‌ని పార్టీ నేత‌ల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

‘నేను పర్యటనకు వచ్చినపుడు నావద్ద షో చేయడం తప్ప మీలో ఒక్కరైనా ప్రజల్లో ఉంటున్నారా? మిమ్మల్ని నమ్ముకున్నం దువల్ల నా పరువు, పార్టీ పరువు పోయింది. మీ వల్లే ఈ దుస్థితి తలెత్తింది. పార్టీ ప్రక్షాళన కుప్పం నుంచే ప్రారంభిస్తా. షోమేన్లను, పర్సనల్‌ అజెండాలతో పనిచేసేవారిని తొలగించి, పోయిన పరువును తిరిగి రాబట్టుకుంటా’ అంటూ సీరియ‌స్ అయ్యారు.

కుప్పంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోవ‌డం వ‌ల్ల త‌న ప‌రువు పోయింద‌ని చంద్ర‌బాబు అన‌డాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రి మంగ‌ళ‌గిరిలో లోకేశ్ ఓడిపోయిన‌ప్పుడు చంద్రబాబు ప‌రువు పోలేదా? అని కుప్పం టీడీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. మంగ‌ళ‌గిరిలో ఓ మంత్రిగా, ముఖ్య‌మంత్రి త‌న‌యుడిగా బ‌రిలో దిగిన లోకేశ్ ఓటమికి ఎవ‌రిని బాధ్యులు చేస్తార‌ని కుప్పం టీడీపీ నేత‌లు నిల‌దీస్తున్నారు. అప్పుడు ఇదే మాదిరి లోకేశ్‌ను తిట్టారా? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

మంగ‌ళ‌గిరిలో ఓడిపోయిన‌ప్పుడే చంద్ర‌బాబు, లోకేశ్‌, టీడీపీ ప‌రువు పోయాయ‌ని, ఇప్పుడు కొత్త‌గా పోవ‌డానికి ఏం మిగిలింద‌ని వారు ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి త‌న ప‌రువును టీడీపీ వాళ్లే పోగొట్టార‌ని కుప్పం ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు అన‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.