చిలుక వాంగ్మూలం.. వ్యక్తికి జీవిత ఖైదు

పిల్లికి ఎలుక సాక్ష్యం అనేది సెటైరిక్ సామెత. కానీ ఇక్కడ జరిగింది సెటైర్ కాదు, సీరియస్ క్రైమ్. ఈ నేరంలో దోషిని శిక్షించడానికి ఓ చిలుక సాక్ష్యం చెప్పింది. చిలుక సాక్ష్యం చెల్లదన్నారు, 9…

పిల్లికి ఎలుక సాక్ష్యం అనేది సెటైరిక్ సామెత. కానీ ఇక్కడ జరిగింది సెటైర్ కాదు, సీరియస్ క్రైమ్. ఈ నేరంలో దోషిని శిక్షించడానికి ఓ చిలుక సాక్ష్యం చెప్పింది. చిలుక సాక్ష్యం చెల్లదన్నారు, 9 ఏళ్లు కేసు నడిచింది. ఫైనల్ గా దోషికి శిక్షపడింది. ఆగ్రాలో జరిగింది ఈ ఘటన.

ఆగ్రాకు చెందిన ఓ వార్తాపత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ విజయ్ శర్మ. ఇతడి భార్య నీలమ్ శర్మ, 2014లో హత్యకు గురైంది. సొంత మేనల్లుడు అషు ఈ హత్య చేశాడు. చిలుక ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఇతడ్ని పట్టుకున్నారు.

ఇంతకీ ఏం జరిగింది..

ఆరోజు ఓ పెళ్లికి హాజరయ్యారు విజయ్ శర్మ. కూతురు, కొడుకుతో కలిసి పెళ్లికి వెళ్లారు. నీలమ్ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఆ టైమ్ లో ఇంట్లోకి ప్రవేశించాడు నీలమ్ మేనల్లుడు అషు. స్నేహితుడు రోనీ సహాయంతో నీలమ్ ను హత్య చేశాడు. ఎదురుతిరిగిన పెంపుడు కుక్కను కూడా హత్య చేశాడు. ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు దోచుకెళ్లేందుకు ఈ హత్యలు చేశాడు అషు.

ఈ హత్య మొత్తాన్ని కళ్లారా చూసింది పెంపుడు చిలుక. నీలమ్ హత్యతో చలించిపోయింది. ఆహారం, నీళ్లు తీసుకోవడం మానేసింది. చిలుక తనకు సహాయం చేయగలదేమో అని విజయ్ శర్మ భావించారు. చిలుక ముందు తన కుటుంబ సభ్యుల పేర్లు చెప్పడం మొదలుపెట్టారు. అషు పేరు చెప్పిన ప్రతిసారి చిలుక వణుకుతూ పలకడాన్ని గమనించారు.

ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పారు. అషును అదుపులోకి తీసుకున్న పోలీసులు, తమదైన శైలిలో ప్రశ్నించడంతో హత్యానేరాన్ని అంగీకరించాడు అషు. తనకు సహకరించిన రోనీ పేరుతో పాటు, డబ్బు-బంగారం ఎక్కడుందో కూడా వెల్లడించాడు.

సాక్ష్యం చెల్లదన్నారు..

కేసు ఓ కొలిక్కి వచ్చిందని అంతా సంతోషించారు. కానీ చిలుక సాక్ష్యం చెల్లదంది కోర్టు. ఎఫ్ఐఆర్ లో చిలుక ప్రస్తావన మొత్తం ఉన్నప్పటికీ, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చిలక సాక్ష్యం చెల్లదు. దీంతో ఈ కేసు తొమ్మిదేళ్ల పాటు సాగింది.

ఈ గ్యాప్ లో నీలమ్ భర్త విజయ్ శర్మ కూడా కరోనాతో చనిపోయారు. సాక్ష్యం చెప్పిన చిలుక కూడా వాంగ్మూలం ఇచ్చిన 6 నెలలకే చనిపోయింది. అయినప్పటికీ విజయ్ శర్మ, ఇద్దరు పిల్లలు కేసును కొనసాగించారు. న్యాయం చేయాలంటూ కోర్టుల చుట్టూ తిరిగారు.

ఎట్టకేలకు స్పెషల్ జడ్జ్ మహ్మద్ రషీద్, ఈ కేసుపై తీర్పు ఇచ్చారు. అషు, రోనీకి జీవితఖైదు వేయడంతో పాటు.. 72వేల రూపాయల జరిమానా విధించారు. అలా చిలుక ఇచ్చిన సాక్ష్యంతో 9 ఏళ్ల తర్వాత ఈ కేసు కొలిక్కి వచ్చింది.