ప్రపంచంలో కొన్ని దేశాలు నామమాత్రపు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. ఒకే పార్టీ, ఒకే నాయకుడు .. వంటి వ్యవహారాలు ఉంటాయక్కడ. తమ జీవిత కాలం తామే అధికారంలో ఉంటే , తాము బతికి ఉన్నన్ని రోజులూ తామే దేశాధినేతలుగా ఉండేలా అక్కడి పాలకులు తామే చట్టాలు చేసుకుంటూ ఉంటారు! వీటిని బనానా రిపబ్లిక్స్ గా అనొచ్చు!.
ఇండియా ఇంకా ఆ దశకు రాలేదు కానీ! కోర్టు తీర్పు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం తో మోడీ సర్కారు భారతీయులకు ఇస్తున్న సందేశం ఎలా ఉన్నా, ప్రపంచానికి ఏం సందేశం ఇస్తోందనే విషయం గురించి కూడా కాస్త ఆలోచించాలి! సాంకేతికంగా బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎలాగైనా సమర్థించుకోవచ్చు!
అయితే.. ఈ తరహా నిర్ణయాలు అంతర్జాతీయంగా కూడా చర్చకు దారి తీస్తాయి. ఫలానా దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించారనేది విదేశీ పత్రికల్లో కూడా వచ్చే మొదటి హెడ్ లైన్. ఇలాంటి ఉదంతమే మరేదైనా దేశంలో జరిగి ఉంటే.. భారతీయ పత్రికలు కూడా ప్రచురిస్తాయి. మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మరి! ఆఖరికి ఏ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఇలాంటిది జరిగినా.. మనది ప్రజాస్వామ్యం కాబట్టి మనల్ని ఈ తరహా వార్తలు ఆకర్షిస్తాయి. ఆ దేశంలో ఇలా చేశారంట అని చెప్పుకుంటాం! మరి మన దగ్గర జరిగితే ఇంకెంతమంది చెప్పుకుంటారు?
ఒక్క మాట అన్నాడని రెండేళ్ల జైలు శిక్ష. ఆ శిక్ష పడిన గంటల వ్యవధిలోనే అనర్హత వేటు! మరి అన్ని కేసుల విషయంలోనూ ఇలాగే ఉంటారా అంటే.. అది వేరే కథ! సీబీఐ కేసులు, ఈడీ కేసులు, ఆఖరికి హత్యానేరాల కేసులు కలిగిన వారు కూడా బోలెడంత మంది భారత ప్రజాస్వామ్యంలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారు! మరి ఇంత ఉదారమైన వ్యవస్థలో ఒక్క మాటతో ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతను అనర్హుడిగా ప్రకటించేయడం.. రష్యా తరహా ఉదంతాలను గుర్తు చేస్తోంది. అక్కడ కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్లను ఈజీగా అనర్హులుగా చేయడం, ఎన్నికల్లో పోటీపై నిషేధం వంటి వార్తలు వస్తూ ఉంటాయి!
కులాలను, వ్యక్తులను కించపరిచే వ్యవహారం లో నేరమయమైనవి కూడా చట్టాలుగా ఉన్నాయి. సాధారణంగా, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది. ఆ కులాల పేరుతో ఎవరినీ నిందించకూడదు. కించపరిచేలా మాట్లాడకూడదు. సాధారణంగా చూస్తే ఓబీసీ కులస్తుడిని కులం పేరుతో కించపరిచారనే కేసులను ఎక్కడా వినం! అయినా కూడా చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ పొలిటీషయన్ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి 'ఎవరు కానీ ఎస్సీ కులాల్లో పుట్టాలని కోరుకుంటారు.. ' అని బాహాటంగా వ్యాఖ్యానించారు! దానిపైనా కేసులు పెట్టారు కొంతమంది.
అయితే కనీసం నమోదైనా చేశారా అప్పుడు! నిజానికి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో పోలిస్తే రాహుల్ చేసిన వ్యాఖ్యలు చాలా చిన్నవే! అయితే వ్యవహరంలో ఎంత తేడా ఉందో!