మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కిరీటాన్ని చంద్రబాబునాయుడు తగిలించారు. దాంతో ఆయన తనదైన స్టైల్లో రచ్చ చేస్తున్నారు. ఆయన ప్రకటనల జోరు కూడాఒక్కసారిగా పెంచేశారు.
తాజాగా అచ్చెన్నాయుడు జగన్ కి మరో కొత్త సవాల్ చేశారు. విశాఖపట్నం రాజధాని ఎందుకు అదేదో శ్రీకాకుళంలో పెట్టండి, భూములు కూడా ఉచితంగా ఇప్పిస్తామంటూ బంపర్ ఆఫర్ వైసీపీ సర్కార్ కే ఇచ్చేశారు.
అంటే విశాఖ రాజధాని కాకుండా అడ్డుకోవడానికి ఇదో కొత్త ట్రిక్ అన్న మాట. విశాఖపట్నాన్ని ఎందుకు రాజధానిగా జగన్ ఎంచుకున్నారో ఇప్పటికే చాలా విపులంగా వివరించారు. రెడీ మేడ్ సిటీ అని పైసా ఖర్చు లేకుండా పాలన సాగించవచ్చునని వైసీపీ పెద్దలు చెప్పారు కూడా.
అయినా సరే ఉంటే అమరావతి లేకుంటే శ్రీకాకుళం అంటూ అచ్చెన్న లాంటి టీడీపీ చేస్తున్నది అచ్చంగా వితండ వాదమేనని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. ఇక అచ్చెన్నాయుడు మరో మాట కూడా అంటున్నారు. మూడు రాజధానుల మీద తక్షణం జనాభిప్రాయం కోరాలట. వెంటనే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలట.
మరి శ్రీకాకుళంలో రాజధాని పెడితే ఇవేమీ అక్కరలేదేమో. మొత్తానికి బాబు బాటలోనే నడుస్తూ ఆయన చెప్పిన మాటలనే తన నోటి వెంట ఆణిముత్యాలుగా అచ్చెన్న జాలువారుస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.