బాలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ ప్రేక్షకుల్ని తన నటనతో మెప్పించి అందరి ప్రేమాభిమానాలను చూరగొన్న హీరోయిన్ పూజా హెగ్డే. పూజా హెగ్డే పేరు వినగానే …తెలుగులో ‘దువ్వాడ జగన్నాథమ్’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’ తదితర హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి.
ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌కు ‘మొహంజోదారో’ సినిమాతో పరిచయం అయ్యారు. హృతిక్‌రోషన్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశ పరిచింది. అయితే ఎవరికైనా మొదటి సినిమానే టర్నింగ్ పాయింట్ అని చెప్పక తప్పదు. ఇదిలా ఉండగా ఫెయిల్యూర్‌తో నిరాశ చెందకుండా సక్సెస్ కోసం ఆ బాధను భరించారామె.
ఇదిలా ఉండగా తాజాగా హౌస్‌ఫుల్ 4 సినిమాతో సక్సెస్ అందుకుని తలెత్తుకుని నిలబడ్డారామె.
ఈ సందర్భంగా హిందీలో రెండో సినిమాకు సంతకం చేయడానికి బాగా గ్యాప్ తీసుకున్నారెందుకుని జాతీయ మీడియా ఆమెను ప్రశ్నించింది. దీనికి సమాధానంగా అనేక ఆసక్తికర విషయాలను పూజా చెప్పుకొచ్చారు.
తన మొట్ట మొదటి సినిమా ‘మొహంజోదారో’ బాక్సాఫీస్ ఎదుట బోల్తా కొట్టడం తనను తనను తీవ్రంగా బాధించిందన్నారు. నటీనటులకెవరికైనా మొదటి సినిమా ఎంతో కీలకమైందన్నారు. ఎందుకంటే సినీ అభిమానులకు పరిచయం చేసేదే అదే కాబట్టి అని తెలిపారు. తన మొదటి సినిమా ఫెయిల్ కావడంతో గుండె పగిలినంత పనైందని పూజా హెగ్డే వాపోయారు.
అయితే దక్షిణాది సినిమాల్లో అవకాశాలు రావడంతో పాటు అక్కడ సక్సెస్ సాధించడంతో ధైర్యంగా ముందుకు సాగినట్టు తెలిపారు. తన మొదటి సినిమా విఫలం కావడం వల్లే బాలీవుడ్‌లో రెండో సినిమాకు సంతకం చేసేందుకు గ్యాప్ తీసుకున్నట్టు పూజా చెప్పారు. ‘హౌస్‌ఫుల్ 4’ సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం బాలీవుడ్‌లో ధైర్యంగా , గర్వంగా నిలబడగలిగానన్నారు.