దుబ్బాక ఉప ఎన్నిక రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఎన్నిక సమీపించేకొద్ది రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
సవాళ్లు, ప్రతిసవాళ్ల ఎపిసోడ్ నడుస్తోంది. ఇదే సమయంలో మరోసారి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బామ్మర్ది సురభి శ్రీనివాసరావు వద్ద రూ.కోటి పట్టుబడినట్టు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు.
బషీర్‌బాగ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటర్లకు పంచేందుకు రూ.కోటి నగదు తీసుకెళుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
వీరిలో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బామ్మర్ది సురభి శ్రీనివాసరావు, అతని డ్రైవర్ రవికుమార్ ఉన్నట్టు ఆయన చెప్పారు.
బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ నుంచి నగదు తీసుకుని దుబ్బాక ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్నట్లు శ్రీనివాసరావు విచారణలో అంగీకరించారన్నారు.
ఆ డబ్బును మాజీ ఎంపీ వివేక్ మేనేజర్ ఇచ్చినట్లు నిందితులు చెప్పారన్నారు. కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నట్టు సీపీ అంజనీకుమార్ వివరించారు.