‘మీటూ’ ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ప్రముఖ నటుడు ముఖేశ్ ఖన్నా మానసిక స్థితిపై మహిళా సెలబ్రిటీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను కించపరిచేలా ఉన్న ఆయన వ్యాఖ్యలపై పలువురు మండిపడు తున్నారు.
ముఖేశ్ ఖన్నా వ్యాఖ్యలపై సీనియర్ నటి రాధిక, గాయని చిన్మయి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లిద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూర్ఖత్వంతో కొంత మంది అలా మాట్లాడుతున్నారని రాధిక అన్నారు. మహిళా సెలబ్రిటీల ఆగ్రహానికి గురి అవుతున్న ముఖేశ్ మీటూ ఉద్యమం గురించి ఏమన్నారో తెలుసుకుందాం.
‘ప్రతివిషయంలోనూ తాము పురుషులతో సమానమని స్త్రీలు ఆలోచించడం వల్లే ‘మీటూ’ ఉద్యమం తెరపైకి వచ్చింది. ఇంటిని చక్కదిద్దడం మాత్రమే మహిళల పని’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు మహిళల కోపానికి కారణమయ్యాయి.
నటి రాధిక ట్విటర్ వేదికగా స్పందిస్తూ …‘వారి మూర్ఖత్వపు మాటలు వింటుంటే భయంకరంగా అనిపిస్తోంది. ఇలాంటి మాటలకు దూరంగా ఉండడమే మంచిది’ అని ట్వీట్ చేశారు.
ప్రముఖ గాయని చిన్మయి స్పందిస్తూ … ‘ఇటీవల కొంతమంది మానసిక ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. అంతేకాదు, వారి మానసిక ఆరోగ్యంపై అనుమానం కూడా కలుగుతోంది. నిజానిజాలేంటో తెలుసుకోకుండా పాత ధోరణిలోనే ఆలోచిస్తుంటారు.
మహిళలు పనులు, ఉద్యోగాలు చేయడంవల్లే మీటూ ఉద్యమం ప్రారంభమైందని చెప్పడం పురుషాహంకారానికి నిదర్శనం. మగవాళ్లు తమ హింసాత్మకమైన కోరికలను అదుపు చేసుకోకపోవడం వల్లే ఇలాంటివి కొనసాగుతున్నాయని చెప్పలేకపోయారు’ అని ఘాటుగా ట్వీట్ చేశారు. మొత్తానికి ముఖేశ్ మాటలు చిత్రపరిశ్రమలో కాక రేపుతున్నాయి.