మనం చిరకాలం అనునిస్తున్న అధికారం, దాని ఫలితంగా వస్తున్న సమస్త వ్యవహారాలు వేరే వాళ్లు లాగేసుకుంటే ఎంత బాధ,.
ఆ బాధ అలా అలా కోపంగా మారాల్సిందే. ఆపై ఆ కోపం కాస్తా పగ కింద మారి తీరుతుంది. ఎప్పుడైతే కోపం, పగగా మారిందో కచ్చితంగా కుట్ర చేయాల్సిందే. లేదూ అంటే పగ ఎలా నెరవేరుతుంది?
కానీ ఎన్ని కుట్రలు పన్నినా పగ నెరవేరకపోతే…మిగిలేది ఆక్రోశమే… తెలుగుదేశం పార్టీ ని నమ్ముకుని, అయిదేళ్ల పాటు ఎంత సంపాదించగలరో అంతా సంపాదించుకున్న 'కొందరి' వ్యవహారం అచ్చం ఇలాగే వుంది. ఇప్పుడు ఇక శాపనార్థాలు, ఆక్రోశాలు తప్ప వారికేం మిగిలినట్లు కనిపించడం లేదు.
తమ మద్దతు పార్టీ ప్రభుత్వం, తమ సామాజిక బంధాల ప్రభుత్వం, 2014లో అధికారంలోకి రాగానే 'కొందరు' పండగ చేసుకున్నారు. మొత్తానికి తాము తిమ్మిని బమ్మిని చేసి, జగన్ కు అనుభవం లేదని ముద్రవేసి, చంద్రబాబుకు అనుభవం పండిపోయిందని టముకు వేసినందుకు ఫలితం దక్కింది. తాము ఎలా ఆడమంటే అలా ఆడే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
దాని ఫలితంగా అయిదేళ్ల పాటు ఏదోరూపంలో కోట్లకు కోట్లు ప్రతిపలం దక్కింది. కానీ జనానికి నిజాలు తెలిసిపోయాయి. అనుభవం గడించింది కావాల్సినంత తమ వారికి గడించి పెట్టడం కోసం అని అర్థం అయిపోయింది. అయిదేళ్లు దాకా వేచి వుండి, తమ వంతు వచ్చాక సింపుల్ గా తీసి పక్కన పెట్టారు.
అదిగో సరిగ్గా అక్కడ ప్రారంభమైంది బాధ. ఆరేడు నెలలు వారిలో వారే బాధపడ్డారు. సరే, టైమ్ రాకపోతుందా అని వెయిట్ చేసారు. కానీ అలాంటి టైమ్ రాలేదు. దాంతో బాధ కాస్తా కోపంగా మారింది. తమ నోటి దగ్గర కూడు లాగేసుకున్న వైఎస్ జగన్ పై కోపం పెరిగింది. దాంతో విమర్శలు పెరిగాయి. కానీ ఆ విమర్శలు పట్టించుకున్నవారు లేరు. ఆ కోపాన్ని గమనించినవారు లేరు. దాంతో కోపం కాస్తా పగగా మారిపోయింది.
మరి పగ ఎలా తీరుతుంది. కుట్రలు చేయాల్సిందే. తమ పార్టీ ఎప్పుడో ఎక్కడెక్కడో ఏర్పాటు చేసిన స్లీపర్ సెల్స్ ను యాక్టివేట్ చేసారు. ప్రభుత్వం కాళ్లలో కర్రలు పెట్టడం ప్రారంభమైంది. ఆ కర్రలు అడ్డం పడి ప్రభుత్వ నిర్ణయాలు పల్టీ కొడితే ఆనందించడం ఆరంభమైంది.
కానీ జగన్ తక్కువ తినలేదు. ఎక్కడ ఏ తాళం వేయాలో ఆ తాళం వేసాడు. ఎక్కడ ఏ తాళం తీయాలో అక్కడ తీసాడు. దాంతో ఈ కుట్రలు భగ్నం అయిపోయాయి. మరింక ఏం మిగిలింది? ఏమీ చేయలని ఆక్రోశమేగా?
ఇప్పుడు తెలుగుదేశం ప్రాపకంతో కింద నుంచి ఫైకి ఎదిగి, కోట్లు సంపాదించుకున్న వారి వ్యవహారం ఇలాగే కనిపిస్తోంది. ఇంక తమేం చేయలేమన్న ఆక్రోశం. చేయగలిగిన మోడీ ఏమీ చేయడం లేదన్న ఆక్రోశం. మోడీ-జగన్ జోడీని ఎలా విడగొట్టాలన్న ఆక్రోశం. తమ బాధను ఆంధ్ర జనాల మొత్తం నెత్తిన రుద్దాలన్న ఆక్రోశం. ఈ ఆక్రోశంలో అసలు వాస్తవాలు మరిచిపోతున్నారు.
కేంద్రం రాష్ట్రంలో హైవేలు కడుతోంది. బైపాస్ లు కడుతోంది. పోలవరం ప్రాజెక్టు కట్టలేదా? కేంద్రంపై పోలవరం బాధ్యత ఆ రోజే పెట్టేసి వుంటే ఎలా వుండేది? ఇవ్వాళ ఈ పరిస్థితి వచ్చి వుండేది కాదు కదా? లెక్కలు పక్కా చెప్పేసి వుంటే ఎలా వుండేది? ఇప్పుడు లెక్కలు అడిగే చిక్కు వుండేది కాదు కదా? కానీ ఈ ఆక్రోశం నింపుకున్న జనాల బాధేంటీ? పోలవరం బూచిని సెంటిమెంట్ గా మార్చి జగన్ ను కార్నర్ చేయాలి కదా? తాము చేస్తే జనం పట్టించుకోరు.
తమది ఆక్రోశం అని అందరికీ తెలుసు కదా? అందుకే మేధావులు స్పందించరేం అనే ఆక్రోశం. మోడీ ని గట్టిగా తిట్టలేరు. ఎలాగైనా మోడీని బాబును కలపాలన్న అజెండా ఒకటి వుంది కదా? అలా అని ఎందుకయినా మంచిది అని మోడీని కూడా కాస్త కార్నర్ చేసే ప్రయత్నం మరోపక్క.
జనం మోడీని మెల్లగా అయినా ద్వేషించాలి. జగన్ ను ఆంధ్ర జనం ముఖ్యంగా మేధావులు నిలదీయాలి. పనిలో పనిగా జగన్ మోడీపై యుద్దం ప్రకటించారు. దాంతో మోడీ-జగన్ విడిపోవాలి.
దాని పలితంగా జగన్ నానా ఇబ్బందులు పడాలి.అప్పుడు తమ ఆక్రొశం, పగ, కోపం చల్లారాలి. బాధ తీరాలి. మళ్లీ అధికారం సంప్రాప్తించాలి. అంతేగా..కాదు..కాదు..అదే తెలుగుదేశం అండతో తమ వ్యాపారాలను తమ ఆదాయాలను పెంచుకున్నవారి బాధ.,
ఆర్వీ