ఈటల రాజేందర్ ఎక్కడ..? ఏం చేస్తున్నారు..?

ఆమధ్య తెలంగాణలో కేసీఆర్ కి పోటీగా వినిపించిన ఒకే ఒక్క పేరు ఈటల రాజేందర్. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత, ఆ ఘన విజయంతో ఈటల పేరు మారుమోగిపోయింది. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా…

ఆమధ్య తెలంగాణలో కేసీఆర్ కి పోటీగా వినిపించిన ఒకే ఒక్క పేరు ఈటల రాజేందర్. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత, ఆ ఘన విజయంతో ఈటల పేరు మారుమోగిపోయింది. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా ఆయన పేరు వినిపించడం తగ్గిపోయింది, మనిషి కనిపించడం కూడా అరుదైన విషయం అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈటల నలుగురిలో నారాయణ అయ్యారు.

అలర్ట్ అయిన బండి..

ఈటల ఎంట్రీతోనే ఒకరకంగా పూర్తిగా అలర్ట్ అయిన బండి సంజయ్ దూకుడు పెంచారు. ఎంపీ అయినా కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు. బండి నీడలో ఈటల అడ్రస్ కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ రేపు తెలంగాణలో బీజేపీ సంచలనాలు నమోదు చేసినా,  అది బండి క్రెడిట్ అవుతుందే కానీ, ఈటల ప్రతిభ బయటకు రాదు.

కేసీఆర్ కి కావాల్సింది కూడా అదే..

టీఆర్ఎస్ లో ఈటల నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. బయటికొచ్చిన తర్వాత బీజేపీలో పెద్ద లీడర్ గా ఎదిగిపోవాలనే ఆశ అయితే ఆయనకు లేదు కానీ, తన ఉనికి కాపాడుకుంటూ, తన వర్గాన్ని తనతోనే ఉంచుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. అధికార పార్టీకి షాకిస్తూ.. హుజూరాబాద్ లో గెలిచి తన పంతం నెగ్గించుకున్నారు.

కానీ బీజేపీ లాంటి జాతీయ పార్టీలో ఈటల మనుగడ కష్టంగా మారింది. ఈటల ఇంకా పూర్తిగా కాషాయ నీడలోకి వెళ్లలేదు. మోదీకి అవమానం జరిగితే వెంటనే రోడ్డెక్కడం లేదు, ఇతర రాష్ట్రాల విషయాల్లో వేలు పెట్టడం లేదు, హిందూత్వం, హిందూ ఆశయాలు, అజెండాలు అంటూ ఎక్కడా అతివాద భావాలు వినిపించడం లేదు. దీంతో సహజంగానే ఆయన బీజేపీలో ఓ ప్రత్యేక నేతగా మారారు. ఆయన జస్ట్ హుజూరాబాద్ ఎమ్మెల్యే మాత్రమే, అంతకు మించి పార్టీకి కానీ, రాష్ట్రానికి కానీ ఇంకేమీ కారు. బహుశా కేసీఆర్ కు కావాల్సింది కూడా ఇదేనేమో.

2023 నాటికి ఎలా..?

సొంత పార్టీ పెట్టినా మనుగడ కష్టమని తెలిసి ఈటల బీజేపీతో సర్దుబాటు చేసుకున్నారు. అదే క్రమంలో ఈటల కాంగ్రెస్ లోకి వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. కాంగ్రెస్ లో నాయకులకు వ్యక్తిగత స్వేచ్ఛ బాగా ఎక్కువ. అందులోనూ పొరుగింటి పుల్లకూరను వారు బాగా ఆస్వాదిస్తారు, ఆదరిస్తారు. సోనియా గాంధీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన రేవంత్ రెడ్డి.. టీడీపీ నుంచి వచ్చి చేరితే నెత్తిన పెట్టుకున్నారు, పీసీసీ ఇచ్చారు.

అదే బీజేపీలో అయితే.. ఆర్ఎస్ఎస్ మూలాలున్నాయా అంటూ వెదుకుతారు. లేకపోతే కండువా కప్పి పక్కనపెడతారు. ఇప్పుడు ఈటల పరిస్థితి కూడా అదే. మరి కాషాయదళంలో ఈటల ఎలా నెగ్గుకొస్తారు, ఎంతవరకు విజయం సాధిస్తారనేది 2023 నాటికి ఓ క్లారిటీ వస్తుంది.