తగ్గేదేలె.. మరోసారి క్లారిటీ ఇచ్చిన రాకీ భాయ్

టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు కన్నడనాట కూడా వరుసగా సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో యష్ నటిస్తున్న కేజీఎఫ్2 కూడా పోస్ట్ పోన్ అవుతుందని అంతా భావించారు. కానీ తమ రిలీజ్ డేట్…

టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు కన్నడనాట కూడా వరుసగా సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో యష్ నటిస్తున్న కేజీఎఫ్2 కూడా పోస్ట్ పోన్ అవుతుందని అంతా భావించారు. కానీ తమ రిలీజ్ డేట్ పై మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇంతకుముందే ప్రకటించినట్టు ఏప్రిల్ 14న కేజీఎఫ్2 థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు.

యష్ బర్త్ డే సందర్భంగా ఈరోజు కేజీఎఫ్2 నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. ఈ పోస్టర్ తో మరోసారి రిలీజ్ డేట్ పై స్పష్టత ఇచ్చి పుకార్లు కొట్టేశారు మేకర్స్. ఇప్పటికే వాయిదాపడిన రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ లాంటి ప్రాజెక్టులు ఏప్రిల్ లోనే విడుదలవుతాయనే టాక్ నడుస్తోంది. మరోవైపు ఆచార్య కూడా వాయిదాపడగా.. సర్కారువారి పాట, ఎఫ్3, హరిహర వీరమల్లు లాంటి సినిమాలు కూడా ఏప్రిల్ రిలీజ్ కు షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో కేజీఎఫ్-2 లాంటి పాన్ ఇండియా కూడా తమ రిలీజ్ డేట్ కు కట్టుబడి ఉండడంతో ఏప్రిల్ బాక్సాఫీస్ పై ఇప్పట్నుంచే వత్తిడి పెరిగింది.

మరోవైపు యష్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. అభిమానులంతా ఆకలితో ఉన్నారని, ఇంకా లేట్ చేయడం బాగుండదనే అర్థం వచ్చేలా స్పందించాడు.

“మా సినిమాను ప్రేక్షకులకు అందించడానికి చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఎందుకంటే, కేజీఎఫ్-2తో ఏం క్రియేట్ చేశామో మాకు తెలుసు. కచ్చితంగా ఇది ప్రేక్షకులకు నచ్చుతుంది. మేం పసందైన భోజనం సిద్ధం చేశాం. ప్రేక్షకులు కూడా ఆకలితో ఉన్నారని తెలుసు. కాబట్టి ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయం.”

ప్రశాంత్ నీల్ డైరక్ట్ చేసిన కేజీఎఫ్ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్టయింది. దీంతో సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సీక్వెల్ లో రవీనా టాండన్, సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ ప్రముఖుల్ని కూడా చేర్చుకుంది యూనిట్.