పెరుగుతున్న కేసులు.. ముదురుతున్న ఆంక్షలు

దేశంలో థర్డ్ వేవ్ మొదలైంది. కేసుల సంఖ్య లక్ష దాటింది. తాజాగా భారత్ లో కరోనా కేసుల సంఖ్య లక్షా 40 వేల మార్క్ చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రంలో…

దేశంలో థర్డ్ వేవ్ మొదలైంది. కేసుల సంఖ్య లక్ష దాటింది. తాజాగా భారత్ లో కరోనా కేసుల సంఖ్య లక్షా 40 వేల మార్క్ చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రంలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 3వేలు దాటడంతో పాటు.. వైరస్ వ్యాప్తి 26 రాష్ట్రాలకు పాకడంతో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

మహారాష్ట్రలో అధికారికంగా లాక్ డౌన్ విధించనప్పటికీ.. ఆ ఛాయలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాక్షిక ఆంక్షల్నే కఠినంగా అమలు చేస్తున్నారు. పూణె, సోలాపూర్, అకోలా, నాసిక్, నాగపూర్, థానె, ఔరంగాదాబ్ జిల్లాల్లో ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి.

ఇక ఢిల్లీలో వీకెండ్ లాక్ డౌన్ మొదలైంది. నిన్న రాత్రి 10 గంటల నుంచి మొదలైన లాక్ డౌన్ సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ టైమ్ లో కేవలం నిత్యావసరాలు, అత్యవసర సేవల కోసం మాత్రమే అనుమతించబోతున్నారు. అటు జమ్ము-కశ్మీర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో కూడా ఆంక్షలు అమలవుతున్నాయి.

మరోవైపు భారత ప్రభుత్వం ఎట్-రిస్క్ దేశాల సంఖ్యను పెంచింది. విదేశాల నుంచి వస్తున్న వ్యక్తుల్లోనే ఎక్కువగా కరోనా/ఒమిక్రాన్ లక్షణాలు బయటపడుతున్న వేళ.. ఎట్-రిస్క్ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ పరీక్షలు, క్వారంటైన్ తప్పనిసరి చేరింది. ఇప్పటికే యూకేతో పాటు పలు యూరోప్ దేశాల్ని ఎట్-రిస్క్ జాబితాలో చేర్చిన భారత ప్రభుత్వం.. తాజాగా ఇజ్రాయెల్, ఇథియోపియా, న్యూజిలాండ్, హాంకాంగ్, జింబాబ్వే, టాంజానియా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా లాంటి మరికొన్ని దేశాల్ని కూడా చేర్చింది.

ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు విమానాశ్రయంలోనే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే ఐసొలేషన్ లోకి వెళ్లాలి. నెగెటివ్ వస్తే హోం క్వారంటైన్ లోకి వెళ్లాలి. వారం రోజుల క్వారంటైన్ తర్వాత తిరిగి మరోసారి పరీక్ష చేయించుకోవాలి. ఎట్-రిస్క్ లిస్ట్ లో లేని దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు కూడా ఎయిర్ పోర్ట్ లోనే పరీక్షలు చేయించుకోవాలి. క్వారంటైన్ తప్పనిసరి. ఇక ప్రయాణానికి 3 రోజల ముందే కరోనా నెగెటివ్ రిపోర్ట్ సమర్పించాలి.

వివిధ సంస్థల అధ్యయనాల ప్రకారం చూసుకుంటే.. దేశంలో కరోనా కేసులు ఈ నెలలోనే గరిష్ట స్థాయికి చేరే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈనెలాఖరుకు లేదా ఫిబ్రవరి రెండో వారానికి కేసులు గరిష్ట స్థాయికి చేరి, మార్చి నెల నుంచి తగ్గుముఖం పట్టొచ్చని అభిప్రాయపడుతున్నారు. థర్డ్ వేవ్ లో భారత్ లో గరిష్టంగా రోజుకు 6 లక్షల నుంచి 8లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదముందని చెబుతున్నారు.