పవన్ కల్యాణ్ కు అభిమానుల ‘ప్రత్యేక’ విన్నపం

ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం పొత్తుల అంశం హాట్ టాపిక్ అయింది. పొత్తుల్లో ఆరితేరిన చంద్రబాబే స్వయంగా అలయన్స్ అంటూ ప్రకటనలు గుప్పించడం, పవన్ పై వన్…

ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం పొత్తుల అంశం హాట్ టాపిక్ అయింది. పొత్తుల్లో ఆరితేరిన చంద్రబాబే స్వయంగా అలయన్స్ అంటూ ప్రకటనలు గుప్పించడం, పవన్ పై వన్ సైడ్ లవ్ అంటూ స్టేట్ మెంట్లు ఇవ్వడంతో పొత్తుల అంశం పతాకస్థాయికి చేరింది. చంద్రబాబుకు కౌంటర్ గా బీజేపీ కూడా ఎన్ కౌంటర్ మొదలుపెట్టడంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ ఈ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి.

కింగ్ మేకర్ కాదు.. కింగ్ అవ్వాలి

ఈ మొత్తం ఎపిసోడ్ లోకి ఇప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా ఎంటరయ్యారు. ఏపీలో జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య నడుస్తున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీలో.. పవన్ కల్యాణ్ కీలకంగా మారాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమ నాయకుడి పేరును ప్రకటించాలని, అలాంటి పార్టీలకే పవన్ మద్దతు ఇవ్వాలని కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.

పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పెద్దగా ఏమీ ఆశించలేదు. ఆ టైమ్ లో ఆయనకు ముఖ్యమంత్రి పదవి అనే ఆలోచన కూడా లేదు. అందుకే అభ్యర్థుల్ని నిలబెట్టకుండా.. పార్టీని మాత్రమే ప్రకటించి చంద్రబాబు-మోదీకి భేషరతుగా మద్దతిచ్చారు. వాళ్ల తరఫున తను ప్రచారం చేశారు.

2019కు వచ్చేసరికి మాత్రం సీన్ మారిపోయింది. పవన్ కు ముఖ్యమంత్రి పదవిపై ఆశపుట్టింది. దీంతో ఆయన వ్యూహాత్మకంగా టీడీపీ నుంచి తప్పుకున్నారు. సొంతగా గెలిచేస్తామనే గుడ్డి నమ్మకంతో బరిలోకి దిగి పరువు పోగొట్టుకున్నారు. చివరికి వ్యక్తిగతంగా కూడా గెలవలేకపోయారు.

ఈసారి మాత్రం పొత్తులతోనే ముందుకెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నారు. అందుకే ఆదికి ముందే బీజేపీతో దోస్తీ కట్టారు. కానీ ఇప్పుడు టీడీపీకి కూడా పవన్ కల్యాణ్ కావాలి. సరిగ్గా ఇక్కడే పవన్ అభిమానులు తమ నాయకుడ్ని ఊరిస్తున్నారు. ఇంతకుమించి మరో అవకాశం రాదని, ముఖ్యమంత్రిగా తన పేరును ప్రకటించిన పార్టీకే మద్దతివ్వాలని పవన్ ను డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. సీఎం అవ్వడానికి ఇంతకంటే షార్ట్ కట్ ఇంకోటి లేదని కూడా సూచిస్తున్నారు.

బీజేపీ ఆ పని చేయడానికి రెడీ

నిజానికి ఈ విషయాలన్నీ పవన్ కల్యాణ్ కు కూడా తెలుసు. సోలోగా గెలవలేకపోయిన తనకు, తన పార్టీకి బీజేపీ-టీడీపీ మద్దతు అత్యవసరం అనే విషయం పవన్ కు అర్థమైంది. కానీ అతడ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లేంత సాహసం ఏ పార్టీ చేస్తుంది? బీజేపీకి ఈ విషయంలో ఎలాంటి భేషజాలు ఉండకపోవచ్చు. 

ఎందుకంటే, ఏపీలో ఆ పార్టీకి సరైన నాయకుడు లేడు. కాబట్టి పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి ఆ పార్టీకి పెద్దగా సమస్యలు ఎదురుకావు. ఎటొచ్చి చంద్రబాబు ఆ పని చేస్తారా అనేది పెద్ద డౌట్. 2014లో పవన్ అండతో అప్పనంగా సీఎం కుర్చీ కొట్టేసిన చంద్రబాబు.. ఇప్పుడు మరోసారి అదే ఎత్తుగడలో ఉన్నారు. అన్నీ అనుకూలిస్తే తన కొడుకు లోకేష్ ను కూర్చోబెట్టే అత్యాశ కూడా బాబుకు ఉంది. 

ఇలాంటి పరిస్థితిలో ఉన్న చంద్రబాబు, పవన్ కు అంత సీన్ ఇస్తారా అనేది పెద్ద డౌట్. ఓవైపు అభిమానులు ఇలా పవన్ కు విజ్ఞప్తులు పంపిస్తుంటే.. మరోవైపు జనసేనాని మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. రీసెంట్ గా రష్యా నుంచి ఇండియాకొచ్చిన ఈ హీరో కమ్ పొలిటీషిన్, ఇప్పుడు తన సినిమాలపై దృష్టి పెట్టారు.