టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ను కూడా వణికిస్తోంది కరోనా. మొన్నటికిమొన్న వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడింది. ప్రస్తుతం హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. నిన్నటికి నిన్న హీరోయిన్ త్రిష తన కరోనా వ్యథను బయటపెట్టింది. ప్రస్తుతం కోలుకున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు సత్యరాజ్ వంతు. అవును.. ఈ సీనియర్ నటుడు కూడా కరోనా బారిన పడ్డాడు.
కరోనా లక్షణాలు కనిపించడంతో నిన్న రాత్రి హుటాహుటిన చెన్నైలోని అమింజక్కరై ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో సత్యరాజ్ ను చేర్పించారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం కరోనాగా నిర్థారించారు. వెంటనే ట్రీట్ మెంట్ కూడా ప్రారంభించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఓ సెక్షన్ మీడియా చెబుతుంటే, నిలకడగానే ఉందని మరో మీడియా ప్రకటిస్తోంది. హాస్పిటల్ నుంచి మాత్రం ఇంకా హెల్త్ బులెటిన్ రాలేదు.
సినీ పరిశ్రమను మరోసారి కరోనా గట్టిగా తాకింది. ఇప్పటికే మహేష్, మంచు లక్ష్మి, మంచు మనోజ్, విశ్వక్ సేన్, తమన్ లాంటి ప్రముఖులు కరోనా బారిన పడగా.. ఇప్పుడు కోలీవుడ్ లో ఒక్కొక్కటిగా కేసులు బయటపడుతున్నాయి.
తాజాగా దుబాయ్ వెళ్లొచ్చిన అల్లు శిరీష్ మాత్రం తను సేఫ్ గా ఉన్నట్టు ప్రకటించాడు. దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే క్వారంటైన్ లోకి వెళ్లిన ఈ నటుడు.. పరీక్షల్లో తనకు నెగిటివ్ వచ్చినట్టు ప్రకటించాడు. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు, కోలీవుడ్ లో షూటింగ్స్ నిలిచిపోయాయి.