ఉద్యోగుల సమస్యలను ఆంధ్ర సిఎమ్ చాలా పద్దతిగా పరిష్కరించుకుని, వ్యవహారం నుంచి గట్టెక్కారు. ఆయన తిప్పలు ఏవో ఆయన పడతారు. ప్రస్తుతానికి అయితే ఉద్యోగులు హ్యపీ. కానీ అన్ హ్యాపీ ఎవరికి అంటే ఉద్యోగులను ఎగసం దోసి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును పెంచే దిశగా వార్తలు వండి వార్చాలనుకున్న మీడియాకే.
వేతన సవరణ మీద రాయడానికి ఏమీ దొరక్క, ఆఖరికి పదవీ విరమణ వయసు పెంచడంపై దృష్టి పెట్టింది. బకాయిలు, పదవీవిరమణ చెల్లింపులు చేయలేకే పెంచేసారు అంటూ సన్నాయి నొక్కలు ప్రారంభించారు.
కానీ ఈవార్తలు వండి వార్చే బాబుగారి ‘సామాజిక’ మీడియా కాస్త వెనక్కు వెళ్లి చూడాల్సి వుంది. 58 ఏళ్ల పదవీ విరమణ వయస్సును ఎవరు, ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో చేసారో తెలుసుకోవాల్సి వుంది. సదరు సామాజిక మీడియా భుజాన ఎత్తుకుని మోసే చంద్రబాబు తన హయాంలోనే పదవీ విరమణ చెల్లింపులు చేయలేక 58 ఏళ్లను 60 ఏళ్లకు పెంచేసారు.
ఆ చెల్లింపులు, అలాగే అప్పటి వేతన సవరణ చెల్లింపులు అలా అలా నెట్టుకువచ్చారు. ఇప్పుడు జగన్ కూడా అదే బాట పట్టారు. ఉద్యోగస్తుల మీద ప్రేమా, చెల్లింపుల భయమా అంటే పదవీ విరమణ వయసు పెంచడం అన్నది ఉభయతారకమంత్రంగా తయారైంది.
నిజానికి ఇది మంచిదా అంటే..అది చంద్రబాబు చేసినా, జగన్ చేసినా తప్పే. ఎందుకంటే ప్రస్తుతానికి భారం దించుకుంటున్నారు అని అనుకుంటున్నారే కానీ, భవిష్యత్ లో భారం పెంచుకుంటున్నారు అని అనుకోవడం లేదు.
ఎందుకంటే ఇప్పుడు 50 వేలు జీతం వున్న వాళ్లకి మరో రెండేళ్ల తరువాత 70 వేలు అయిపోతుంది. రెండేళ్ల పాటు వాళ్ల జీతాలు భరించాలి. పైగా రెండేళ్ల తరువాత ఈ కొత్త జీతం లెక్కన పదవీ విరమణ చెల్లింపులు చేయాలి. ఆపై అదే లెక్కన పింఛను నిర్ణయించాలి. ఇవన్నీ ప్రభుత్వంపై భారాలే.
కానీ అపరిమితమైన తెలివితేటలు వున్న చంద్రబాబు ఈ మార్గం కనిపెట్టి కొలంబస్ అనిపించుకున్నారు. ఇప్పుడు జగన్ అదే బాటలో సాగిపోతున్నారు. రేపు మళ్లీ ఎవరు వచ్చినా ఇలాగెే వెళ్లిపోవాల్సిందేమో? ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ఏ డెభై ఏళ్లకో చేర్చేస్తారేమో అందరూ కలిసి.