ఆమె చావో రేవో తెలంగాణలోనే తేల్చుకోవాలి

దివంగత సీఎం వైఎస్సార్ కుమార్తె  వైఎస్ షర్మిల హఠాత్తుగా తెలంగాణా రాజకీయాల్లోకి ప్రవేశించింది. అలాంటి ఆలోచన ఆమెకు ఎందుకు వచ్చిందో తెలియదు. ఆవేశంగా వచ్చిందో, ప్లాన్ ప్రకారం వచ్చిందో చెప్పలేం. కానీ ఒకసారి వచ్చాక…

దివంగత సీఎం వైఎస్సార్ కుమార్తె  వైఎస్ షర్మిల హఠాత్తుగా తెలంగాణా రాజకీయాల్లోకి ప్రవేశించింది. అలాంటి ఆలోచన ఆమెకు ఎందుకు వచ్చిందో తెలియదు. ఆవేశంగా వచ్చిందో, ప్లాన్ ప్రకారం వచ్చిందో చెప్పలేం. కానీ ఒకసారి వచ్చాక తాడో పేడో, చావో రేవో తేల్చుకోవాలికదా. అందులోనూ వైఎస్సార్ కూతురు, జగన్ సోదరి. వెనకడుగు వేస్తే పరువు పోతుంది. తన పార్టీకి తెలంగాణలో ఆదరణ లేదని, మద్దతు లేదని తెలిసినా రాబోయే ప్రభుత్వం తన పార్టీదేనని చెబుతోంది.

సీఎం కేసీఆర్ మీద రోజూ విమర్శలు గుప్పిస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడానికి యేవో కార్యక్రమాలు చేస్తూనే ఉంది. షర్మిల పార్టీలో నాయకులు ఎవరూ చేరకుండా ఏపీ సీఎం జగన్ చేస్తున్నాడని ఆయనంటే పడని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడు. ఆయన పత్రికాధిపతి కాబట్టి అందులో ఎంతవరకు నిజముందో ఆయనకే తెలియాలి. షర్మిల పార్టీలో నాయకులను చేరకుండా చేసే బదులు జగన్ ఏదో విధంగా తెలంగాణలో తన పార్టీనే పునరుద్ధరించుకోవచ్చు కదా.

కానీ జగన్ కు వాస్తవం తెలుసు. ఆంధ్రా పార్టీ తెలంగాణలో మనుగడ సాగించలేదని తెలుసు. అందుకే గమ్మున ఉండిపోయాడు. టీడీపీకి తెలంగాణలో ఏమైందో జగన్ కు తెలుసు. మరి షర్మిల ఈ విషయం ఆలోచించలేదేమో. చక చకా తెలంగాణాకు వచ్చి పార్టీ పెట్టింది. తాను తెలంగాణా కోడలినని, తనకు పార్టీ పెట్టే హక్కు ఉందని ఆమె చెప్పుకుంటున్నప్పటికీ తెలంగాణలో ఆమెను ఆంధ్రా వ్యక్తిగానే చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ మధ్య షర్మిల ఆంధ్రాలోనూ పార్టీ పెట్టబోతున్నదని ప్రచారం జరుగుతోంది. ఆమె ఆ మాట అనలేదుగానీ మీడియాలో ప్రచారమవుతోంది. మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు వైఎస్ షర్మిల స్పందించారు. తనంతట తానుగా పార్టీ పెడతానని షర్మిల చెప్పలేదు. ఏపీలో పార్టీ పెడతారా? అన్న ప్రశ్నకు మాత్రం ఎందుకుపెట్టకూడదని స్పందించారు.

నిజానికి తెలంగాణలో పార్టీ పెట్టి షర్మిల ఇప్పటికీ కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆ పార్టీలో చేరేవాళ్లే లేరు. గట్టు రామచంద్రరావు లాంటి నేతలు చేరినా పార్టీకి పెద్దగా ఉపయోగం లేదు. తెలంగాణలో షర్మిలను ఏపీ వాసిగానే చూస్తారు. షర్మిల తెలంగాణ రాజకీయాలో పెద్దగా ప్రభావం చూపే అవకాశం అయితే లేదు .ఇక ప్రచారం జరుగుతున్నట్లు అన్న జగన్ తో విభేదించి మరో పార్టీ పెట్టినా షర్మిల సాధించేదేమీ ఉండదు.

ఎందుకంటే జగన్ క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్నారు. పైగా అధికారంలో ఉన్నారు. ఆయనను ఎదుర్కొనలేక ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ చంద్రబాబే సతమతమవుతున్నారు. రాజశేఖర్ రెడ్డి వారసుడిగా ఏపీ వాసులు జగన్ నే చూస్తారు. రెడ్డి సామాజికవర్గంలోనూ వైఎస్ షర్మిలకు మద్దతు లభించడం కష్టమే. తెలంగాణలో అధికారంలోకి వస్తానని చెప్పినట్లుగానే ఏపీలో పార్టీ ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నించింది.

ఇలా మాట్లాడటం రాజకీయ నాయకుల సహజ లక్షణం. దాన్ని ఆధారం చేసుకొని షర్మిల ఏపీలో పార్టీ పెడుతుందని అనుకోవడం పొరపాటు. తెలంగాణా రాజకీయాల్లో ప్రవేశించింది కాబట్టి షర్మిల చావో రేవో ఇక్కడే తేల్చుకోవడం మంచిది. ఆవేశంతో ఏపీకి కూడా వెళితే ఆమెకు అవమానం ఎదురుకావడం తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. తెలంగాణలో పార్టీకి ఆదరణ లేదని భావిస్తే మూసేయడమే మంచిది. దానివల్ల ఆమెకు వచ్చే నష్టం ఏమీ లేదు.