హైదరాబాద్ లో రోజురోజుకు ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత అవగాహన కలిగిస్తున్నప్పటికీ, ఎక్కడో ఓ చోట ఏదో ఒక రూపంలో ఆన్ లైన్ బాధితులు బయటపడుతూనే ఉన్నారు. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ, ఆన్ లైన్ మోసానికి బలైంది. ఏకంగా కోటి 20 లక్షల రూపాయలు పోగొట్టుకుంది.
ఆన్ లైన్ ట్రేడింగ్ చేయండి, కోట్లు ఆర్జించండి అంటూ ఫేస్ బుక్ లో వచ్చిన ఓ పోస్టుకు ఆకర్షితురాలైంది ఓ మహిళ. డీమ్యాట్ ఎకౌంట్ కూడా ఓపెన్ చేసి ఇస్తామని చెప్పడంతో నమ్మేసింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోసం ముందుగా 5 లక్షలు కావాలని అట్నుంచి కోరడంతో, ఆ మేరకు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేసింది.
అలా పెట్టిన 5 లక్షలతో 88 లక్షల రూపాయల లాభం వచ్చినట్టు అట్నుంచి మోసగాళ్లు సమాచారం అందించారు. అయితే ఆ 88 లక్షలు కావాలంటే ఇంకాస్త సొమ్ము చెల్లించాలని, అది కూడా ట్రేడింగ్ లోనే పెడతామని, మరిన్ని లాభాలొస్తాయని నమ్మించారు. దీంతో దశలవారీగా కోటి 20 లక్షల రూపాయలు సమర్పించుకుంది సదరు మహిళ.
ఇంత జరిగినా తనకు ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో అప్పుడు మోసపోయినట్టు గ్రహించింది. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించింది, తన గోడు చెప్పుకుంది.
ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఇండోర్ కు చెందిన రజత్ పతేరియా, అశ్విన్ బగాదారే ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. పక్కా స్కెచ్ తో వలపన్ని ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. అయితే వారి నుంచి డబ్బు మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయారు. 3 సెల్ ఫోన్లు, కొన్ని డెబిట్ కార్డులు, లక్షా 2వేల రూపాయల నగదు మాత్రమే పోలీసులకు చిక్కింది.