షాకింగ్: రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు!

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు ప‌డింది. ప‌రువు న‌ష్టం కేసులో దోషిగా తేలిన నేప‌థ్యంలో రాహుల్ గాంధీ లోక్ స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు అయింద‌ని.. రాహుల్ ఎంపీగా చెల్లుబాటు కార‌ని…

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు ప‌డింది. ప‌రువు న‌ష్టం కేసులో దోషిగా తేలిన నేప‌థ్యంలో రాహుల్ గాంధీ లోక్ స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు అయింద‌ని.. రాహుల్ ఎంపీగా చెల్లుబాటు కార‌ని లోక్ స‌భ సెక్ర‌టేరియ‌ట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీ మాజీ ఎంపీ అయ్యారు. 

2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తూ మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ.. దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..? ఆయన ప్రశ్నించారు. రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ.. సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రాహుల్‌ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తాను అలా అనలేదని రాహుల్‌ తన వాదనను వినిపించారు. అయితే, కోర్టు ఆయణ్ని దోషిగా తేల్చి.. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూర‌త్ కోర్టు తీర్పునిచ్చిన విష‌యం తెలిసిందే.

కాగా గ‌తంలో లక్షద్వీప్‌కు చెందిన ఎన్‌సీపీ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌ను ఓ హత్యాయత్నం కేసులో స్థానిక కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో.. అతడిని అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రెటేరియట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనంతరం సెషన్స్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎంపీ ఫైజల్‌.. కేరళ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆ తీర్పు అమలును నిలిపివేసింది. ఈ పరిణామం తర్వాత ఆయన ఎంపీ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర న్యాయశాఖ సిఫార్సు చేసింది.

రాహుల్ గాంధీ కూడా తీర్పును పై కోర్టులో స‌వాలు చేస్తారా లేదా అనేది చూడాలి. పై కోర్టులో రాహుల్ కు అనుకూలంగా తీర్పు వ‌స్తే ఎంపీ స‌భ్య‌త్వం తిరిగి పొందాడానికి ఆవ‌కాశం ఉంది.