బీజేపీ తమిళనాడు విభాగం అధ్యక్షుడు అన్నామలైపై తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి ఫైరయ్యాడు. బీజేపీతో తమకు ఎలాంటి పొత్తు లేదంటూ తమ పార్టీ కార్యకర్తలకు ఈ అన్నాడీఎంకే నేత ప్రకటించాడు. బీజేపీ తీరు సరిగా లేదని, ప్రత్యేకించి అన్నామలై వ్యవహారం సమంజసం కాదంటూ పళని స్వామి వ్యాఖ్యానించాడు.
పెరియార్ ను విమర్శిస్తాడు, అన్నాదురైని విమర్శిస్తాడు, జయలలితను విమర్శిస్తాడు.. ఆయన తీరు సరికాదంటూ పళని వ్యాఖ్యానించాడు. ఇటీవల ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాలు జాతీయ స్థాయిలో చర్చకు నిలిచాయి. మరి ఉయనిధి మాటలతో తమిళనాట బీజేపీ ప్రయత్నాలు కూడా తీవ్రం అవుతాయని అనుకున్నారంతా! అయితే పెరియార్, అన్నాదురైలను విమర్శిస్తే సహించేది లేదని పళని స్వామి బీజేపీని హెచ్చరిస్తున్నాడు.
వారిని విమర్శించే అన్నామలై తన తీరును మార్చుకోవాలంటూ వ్యాఖ్యానించాడు. తమిళనాట బీజేపీతో తమకు ఎలాంటి పొత్తు లేదని కూడా ప్రకటించాడు. మరి ఎన్నికలకు మరెంతో దూరం లేదు. తమిళనాట బీజేపీకి అన్నాడీఎంకేనే ఆశ. జయలలిత మరణం తర్వాత ఒక రకంగా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీనే కాపాడింది.
ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే చిత్తయ్యింది. లోక్ సభ ఎన్నికల నాటికి అన్నాడీఎంకే ఏమైనా పుంజుకుంటే దాంతో పాటు బీజేపీ కూడా కొద్దో గొప్పో సీట్లను పొందే అవకాశం ఉంది. ఈ సారి లోక్ సభ ఎన్నికలతో తిరిగి పుంజుకోవాలని అన్నాడీఎంకే భావిస్తోంది. అయినప్పటికీ.. బీజేపీ లగేజ్ ను భరించేందుకు ఈ పార్టీ అంత ఇష్టంగా అయితే లేనట్టుగా ఉంది.