తనకేమో కేంద్రంలోని ఇంటెలిజెన్స్ వర్గాలు ఏవేవో సమాచారాలు ఇస్తూ ఉంటాయని తరచూ ప్రకటించుకుంటూ ఉంటాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తన మాటలు ఊరికే చెబితే ఎవరూ వినరని.. ఇలా కేంద్ర నిఘా వర్గాలు, కేంద్రంలోని అత్యంత పెద్ద వాళ్లు తనకు చెవిలో చెప్పారంటూ పవన్ కల్యాణ్ కామెడీలు చేస్తూ ఉంటారు! ఈ కామెడీలు ఇటీవల కూడా కొనసాగాయి.
తను కోనసీమలో పర్యటిస్తున్నప్పుడు రాయలసీమ నుంచి రౌడీలను తెచ్చి మినిమం యాభై మందిని చంపేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందటూ పవన్ కల్యాణ్ కాకమ్మాగువ్వమ్మ కథలను చెప్పారు! ఎంత చంద్రబాబు దత్తపుత్రుడు అయితే మాత్రం అన్నీ ఆయన లక్షణాలను పుచ్చుకుంటూ రాయలసీమ మీద కూడా పవన్ విషం కక్కాడు!
మరి ఢిల్లీలో ఈ స్థాయి పరపతిని కలిగి ఉన్న పవన్ కల్యాణ్.. ఇంతకీ ఎందుకు చంద్రబాబు తరఫున ఢిల్లీకి వెళ్లడం లేదనేది శేష ప్రశ్న! జైలుకు వెళ్లి చంద్రబాబును కలిసి వచ్చిన పవన్ కల్యాణ్.. ఆ వెంటనే పొత్తు ప్రకటన కూడా చేశారు. చంద్రబాబుకు తన పూర్తి మద్దతు ఉంటుందంటూ స్పష్టం చేశాడు.
ప్రజారాజ్యం పార్టీ అప్పుడు, గత ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు చంద్రబాబు అవినీతి కేసులోనే అరెస్టు అయితే పూర్తి మద్దతూ ప్రకటించేశాడు. ఆ పై తెలుగుదేశం వాళ్లు ఏమైనా అన్నా భరించాలి తప్ప ఎదురు తిరగవద్దని తన పార్టీ శ్రేణులకూ స్పష్టం చేశాడు! మరి ఇన్ని చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఢిల్లీ పర్యటన పెట్టుకుని.. చంద్రబాబు తరఫున ఎందుకు కమలం పార్టీ నేతలను కలవడం లేదో!
తనకు ఢిల్లీలో ఉన్న పరపతి గురించి చాలా చెప్పుకునే పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి చంద్రబాబును అరెస్టు గురించి కమలం పార్టీ అగ్రనేతలతో మాట్లాడొచ్చు కదా! చంద్రబాబుకు జరిగిన అన్యాయం గురించి చెప్పి.. జగన్ ప్రభుత్వంపై కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చేలా చేయవచ్చుగా! కేంద్రంలో తనకున్న ఇంటెలిజెన్స్, తనకు ఢిల్లీలో ఉన్న పరిచయాల గురించి గాలి గన్నారావు కబుర్లను చెప్పే పవన్ కల్యాణ్.. ఇప్పుడు దాన్నంతా ఉపయోగిచడం లేదేందుకో!
అందునా తన పార్ట్ నర్ జైలు పాలైతే ఆయనను బయటకు తీసుకొచ్చేందుకు పవన్ ఢిల్లీ వరకూ వెళ్తే అది బిల్డప్ కు అయినా బాగుండేది! అందుకు కూడా పవన్ వెనుకడుగు వేస్తున్నట్టుగా ఉన్నాడు. చంద్రబాబు తరఫున తను వకాల్తా పుచ్చుకుని ఢిల్లీ వెళితే బీజేపీ నేతలు తన తలంటుతారని పవన్ కు భయమా! లేక చంద్రబాబు అరెస్టు గురించి బీజేపీ అధినాయకత్వం స్టాండ్ ఏమిటో పవన్ కు క్లారిటీ ఉన్నట్టేనా!