“మా అబ్బాయి హైదరాబాదులో ఫ్లాట్ కొనుక్కున్నాడండీ” అనగానే, “మా అబ్బాయి కూడా అమెరికాలో మొన్ననే కొన్నాడు. ఫ్లాట్ కాదు, పెద్ద ఇల్లు” అని బదులిచ్చేవాళ్లు చాలామంది కనిపిస్తుంటారు ప్రతివారి బంధువుల్లోనూ.
అమెరికాలో “పెద్ద ఇల్లు” అని వినగానే హైదరాబాదులో “ఫ్లాట్” చిన్న విషయంగా అనిపించవచ్చు.
కానీ ఇప్పుడున్న లెక్కల్లో మంచి గేటెడ్ కమ్యూనిటీలో హైదరాబాదులో కొనే ఫ్లాట్ కి, అమెరికాల్లోని చాలా నగరాల్లో కొనే లంకంత కొంపకి ధరలో పెద్ద తేడా ఉండట్లేదు.
గతంలో అమెరికాలో సంపాదించుకుని హైదరాబాదులో రియలెస్టేట్ పెట్టుబడులు పెట్టేవాళ్లు మన ఎన్నారైలు. కానీ ఇప్పుడు హైదరాబాద్ ఇళ్ల రేట్లు చూసి గుడ్లు తేలేసే పరిస్థితి ఏర్పడుతోంది వాళ్లకి.
ఇక్కడ కొనడం కంటే అమెరికాలోనే కొనుక్కోవడం నయమేమో అన్న చందాన ఉంటున్నారు చాలామంది. పైగా ఇక్కడ కొనే అగ్గిపెట్టెంత ఫ్లాట్ కి అంత డబ్బు పోయడం సరైన నిర్ణయం అనిపించట్లేదు. దీనికి తోడు అతి తెలివికి పోయి బ్యాంక్ లోన్ తీసుకుంటే లాభం మాట అటుంచి అది ఎంత తెలివి తక్కువ పనో తర్వాత కానీ బోధపడదు.
హైదరాబాదులో అమాంతం రియలెస్టేట్ ఎందుకింత పెరిగిపోయింది?
గచ్చిబౌలి వైపు పశ్చిమ హైదరాబాద్ మీద ప్రభుత్వం దృష్టిపెట్టి డెవెలప్ చేయడం వల్ల ఆ ప్రాంతమంతా అమెరికాని తలపించేలాంటి రోడ్లు, భవనాలు వెలిసాయి. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎంత అభివృద్ధికి అంత నిర్వహణ ఖర్చు మామూలే.
చాలానాళ్లు ఒక అభిప్రాయం ఉండేది- హైదరాబాదు ఆదాయం మీద రాష్ట్రమంతా బతుకుతోందని…కానీ అది నిజం కాదు. రాష్ట్రం మొత్తం ఆదాయంతో పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం పనితీరు అలా ఉంది.
దానివల్ల కొన్ని ప్రాంతాల్లో భూముల రేట్లు కూడా అమెరికాని తలదన్నేలా ఉంటున్నాయి.
ఒకరకంగా బెంగళూరు కంటే కూడా హైదరాబాద్ భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయి.
పశ్చిమం వైపు అంతలా పెరిగితే మిగిలిన దిక్కులు ఊరుకోవు కదా!
అభివృద్ధి స్థాయి తక్కువగానే ఉన్నా ఇంచుమించి అన్ని దిక్కుల్లోనూ హైదరాబాద్ ల్యాండ్ రేట్లు పెరిగాయి.
మహా అయితే పశ్చిమ హైదరాబాదు వైపుతో పోలిస్తే మిగిలిన దిక్కుల్లో భూముల రేట్లు సుమారు 25%-30% శాతం తక్కువ ఉండొచ్చంతే.
ఇక దూరాలు పోయే కొద్దీ తగ్గుదల సహజం. అది వేరే సంగతి.
ఈ పెరుగుదల రీత్యా, పెట్టిన పెట్టుబడి రెండింతలు, మూడింతలు అవుతుందని కొంతమంది ఎన్నారైలు పెట్టుబడులుపెడుతున్నారు.
కొందరైతే ఇద్దరు ముగ్గురు కలిసి తలో కాస్తా వెసుకుని అపర్ణ, రాజపుష్ప, మై హోం లాంటి వెంచర్లలో ఫ్లాట్లు, విల్లాలు కొంటున్నారు.
అయితే పెరుగుదల శాతం ఎంతుంటుందో ఆ ప్రోపెర్టీ అమ్ముడయ్యేవరకూ తెలియదు.
అన్నిసార్లూ అనుకున్నంత ఎక్కువ రాకపోవచ్చు.
ఎక్కడికక్కడ ఉన్నచోటే కొత్త వెంచర్లు వెలుస్తుంటే పాతవాటికి గిరాకీ ఎంతవరకూ ఉంటుందో చెప్పడం కష్టం.
పైగా మూడు నెలల క్రితం 7000/- చదరపు అడుగైతే, ఇప్పుడు 7500/- అయిపోయిందంటూ కంగారు పెట్టే బిల్డర్లు ఎక్కువైపోయారు. మరో ఏడాదికి 10,000/- అవుతుందని చెప్తారు. ఎక్కడో కొన్ని తప్ప అన్నింటికీ అంత పెరుగుదల ఉండదు.
సరే..ఒకవేళ పెరిగి మూడింతలైనా, అమ్ముకుని ఆ డబ్బుని అమెరికా తీసుకెళ్లాలంటే అంత ఈజీ కాదు. ఇండియాలోనే చచ్చేటన్ని ట్యాక్సులున్నాయిప్పుడు. అది కట్టి అమెరికాకి తీసుకువెళ్తే అక్కడేదైనా డిఫెరెన్స్ ట్యాక్స్ ఉంటే అది కూడా కట్టాలి. ఇవన్నీ కట్టి లెక్క చూసుకుంటే ఒక్కోసారి పెట్టిన పెట్టుబడికి ఆశించిన లాభం చేకూరకపోవచ్చు.
అందునా, అమెరికా వెళ్లిన వాళ్లు అక్కడే సెటిలయ్యే ఆలోచనతో ఉండేవాళ్లే ఎక్కువ. గ్రీన్ కార్డు వచ్చిందంటే మానసికంగా ఇండియాతో తెగతెంపులు మొదలవుతాయి. ఇండియాలో తల్లిదండ్రులున్నంతవరకు రాకపోకలుంటాయి. తర్వాత నెమ్మదిగా ఆస్తులమ్మేసుకుని పూర్తిగా అమెరికాలోనే బతికేసే ఆలోచనలు వస్తాయి. అలాంటప్పుడు హైదరాబాదులో కోట్లు గుమ్మరించడమెందుకు అంటూ డలాస్ లాంటి నగరాల్లో రియెలెస్టేట్ వ్యాపారులు ఎన్నారైలని తమ వైపుకు లాక్కుంటున్నారు. అక్కడ నాలుగైదు కోట్లల్లో విశాలమైన ఒక అంతస్తున్న ఇళ్లే కొనొచ్చు.
ఇక ఫ్లాట్స్, విల్లాలు కాకుండా స్థలాల విషయానికొద్దాం.
టెక్సాస్ రాష్ట్రంలోని తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే డలాస్, ఆస్టిన్, హ్యూస్టన్ నగరాల్లోని భూముల ధరలు హైదరబాదులోని ఐటీ కారిడార్ రేట్లతో పోలిస్తే పదింతలు తక్కువ. అది మామూలు విషయం కాదు కదా!
హైదరాబాదులోని మంచి ఏరియాలో రూ 40 కోట్ల నుంచి రూ 50 కోట్ల దాకా ఎకరం ధర పలికే పరిస్థితి ఉంటే ఆస్టిన్, డలాసుల్లో రూ 4 కోట్ల నుంచి రూ 6 కోట్లకే ఎకరం భూమి లభిస్తోంది.
హైదరాబాదులో స్థలాల్ని కాపడుకోవడం కష్టం. అమెరికాలో ఆ పరిస్థితి లేదు.
కనుక భారీ పెట్టుబడులు పెట్టాల్సిన ఆలోచన ఉంటే హైదరాబాదుకంటే అమెరికానే నయమనుకునే ఆలోచనకి వస్తున్నారు చాలామంది.
దానికి తోడు పటాన్ చేరువు తదితర ప్రాంతాల్లో 2005- 2010 మధ్యన కొన్న స్థలాలు చాలా వరకు కబ్జాలైపోయి ఇబ్బంది పడుతున్న ఎన్నారైల జాబితా కూడా పెద్దగానే ఉంది.
సేఫ్ వెంచర్ అన్న చోట కొన్నా కూడా, అప్పట్లో డీటీసీపీ లే ఔట్స్ లేని కారణంగా అవి కాలక్రమంలో కబ్జాలైపోవడం పలువురిని దెబ్బతీసింది.
కోర్టుకెళ్లినా దిక్కులేని పరిస్థితి. లోకల్ నాయకులే ఆ కబ్జాల వెనుక ఉండడం మరొక దుస్థితి.
ఆ అనుభావలను చెప్తుంటే కొత్త వాళ్లు హైదరాబాద్ స్థలాల మీద పెట్టుబడులు పెట్టడానికి సాహసం చేయట్లేదు.
అమెరికాలో కేలిఫోర్నియాలోని బే ఏరియా, న్యూయార్క్ వంటి ప్రాంతాలు చాలా కాస్ట్లీ ప్రదేశాలు. అలా ఇండియాలో కాస్ట్లీ నగరాలంటే ముంబాయ్, హైదరాబాద్ అని చెప్పుకోవాల్సి వస్తోంది. ఆ తర్వాతనే మిగిలిన నగరాల లిస్టు చెప్పుకునే రోజులు దగ్గరపడ్డాయి.
హైదరాబాదులో గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాటున్నవాడు శ్రీమంతుడు, విల్లా ఉన్నవాడు కుబేరుడు!!
కానీ నివాసానికి కాకుండా పెట్టుబడుల కోసమైతే మాత్రం ఎన్నారైలకి అమెరికాలో పెట్టుబడులే నయమంటున్నాయి లెక్కలు.
పద్మజ అవిర్నేని