మహిళా రిజర్వేషన్ బ్రహ్మాస్త్రం అవుతుందా?

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘనమైన విజయాన్ని సాధించి.. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ఒక బ్రహ్మాస్త్రం అవుతుందా? చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా…

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘనమైన విజయాన్ని సాధించి.. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ఒక బ్రహ్మాస్త్రం అవుతుందా? చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా మోడీ సర్కారుకు దేశవ్యాప్తంగా మహిళాలోకం నీరాజనం పడుతుందా? భాజపా ఢంకా బజాయించి మరోసారి గద్దె మీదకు రాబోతుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

సుమారు పాతికేళ్లకుపైగా పెండింగులోనే ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం అనేది దేశ రాజకీయాల్లోనే ఒక కీలక పరిణామం. దీని ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మోడీ సర్కారు చొరవ తీసుకోవాలని కొన్నాళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్న ప్రతిపక్షాలకు నోర్లకు తాళం వేసినట్లు కూడా అవుతుందని బిజెపి భావిస్తున్నది.

మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ఇప్పటి వ్యవహారం కాదు. 1996లో హెచ్ డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ప్రభుత్వం తొలుత ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టింది. తర్వాత వాజపేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల సమయంలో కూడా ప్రవేశ పెట్టడం జరిగింది. అయితే బిల్లు సభ ఆమోదానికి మాత్రం నోచుకోలేదు. మొత్తానికి ఈ బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందింది. 

లోక్ సభలో కొన్ని పార్టీలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడం, బిల్లు కాగితాలను చించి పారేయడం నానా రభస చేసిన నేపథ్యంలో అది పెండింగులోనే ఉండిపోయింది. 2014లో కాంగ్రెస్ సర్కారు పతనమై లోక్ సభ రద్దయ్యాక బిల్లు మురిగిపోయింది.

అప్పటినుంచి అడపాదడపా ప్రతిపక్షాలు మహిళా బిల్లు గురించి నినాదాలు చేయడం జరుగుతూ వస్తోందే తప్ప.. దీనిని లోక్ సభ ఆమోదం పొందేలా చేయడానికి నిర్మాణాత్మక కృషి జరగనేలేదు. ఇప్పుడు మోడీ సర్కారు మళ్లీ మహిళా బిల్లును తెరపైకి తీసుకు వచ్చింది. తాజాగా కేబినెట్ కూడా ఆమోదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. 

కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు ప్రారంభం అయ్యాక.. కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకుంటుందని మోడీ సర్కారు ఆల్రెడీ ప్రకటించిన నేపథ్యంలో.. ఈ సమావేశాల్లోనే మహిళా బిల్లు ఆమోదం పొందుతుందని అందరూ భావిస్తున్నారు. మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించే దిశగా ఈ బిల్లు బ్రహ్మాస్త్రం అవుతుందని కూడా పలువురు భావిస్తున్నారు.