రజాకార్ పేరుతో ఒకప్పటి తెలంగాణలోని పరిస్థితులను చిత్రించే ప్రయత్నం గా రూపొందుతున్న సినిమా ఇప్పుడు తాజా సంచలనంగా మారుతుంది. ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ విడుదలైన తర్వాత.. తెలంగాణ పౌర సమాజంలో శాంతి భద్రతలపరంగా అతిపెద్ద సమస్య అవుతుందని భయాలు వ్యాప్తి చెందుతున్నాయి.
నిజాం పాలనలో రజాకారులు తెలంగాణ ప్రజలను ఏ రకంగా హింసించారనే విషయంలో.. ఈ సినిమాలో అనేక సన్నివేశాలను చిత్రించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రజాకార్లు నిజాం తరఫున దుర్మార్గమైన దోపిడీ పరిపాలన సాగించడం మాత్రమే కాదు.. హిందువులను ఊచకోత కోశారని, బలవంతపు మతమార్పిడులకు పాల్పడ్డారని, అత్యంత హేయమైన రీతిలో హింసించారని రజాకార్ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చిత్రం విడుదలయితే కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా హిందూ ముస్లిం విద్వేషాలు చెలరేగడానికి అవకాశం ఉంటుంది. అదే భయం ఇప్పుడు ట్రైలర్ చూసిన అందరిలోనూ వ్యక్తం అవుతోంది.
రజాకార్ సినిమా ట్రైలర్‌ను ఒక వ్యక్తి తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. ఈ సినిమా విడుదలయితే శాంతి భద్రతలు దెబ్బతినే ప్రమాదం ఉందనే సంగతిని ఆయన హెచ్చరించారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. తెలంగాణ లో ఉన్న సౌహార్ధ వాతావరణన్ని దెబ్బతీయడానికి ఎలాంటి ప్రయత్నాన్ని కూడా తాము అనుమతించబోయేది లేదని హెచ్చరించారు. సెన్సార్ బోర్డు తో కలిసి ఈ సినిమాలు నిషేధించడానికి ప్రయత్నిస్తామని కూడా కేటీఆర్ పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీలోని కొందరు దివాలాకోరు మేధావులు.. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రయత్నంగా కేటీఆర్ దీనిని అభివర్ణించారు. తెలంగాణ పోలీసు అధికారులతో కలిసి ఇక్కడ శాంతి భద్రతలు ఈ సినిమా వాళ్ళని ఏమాత్రం దెబ్బ తినకుండా చూసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని కూడా కేటీఆర్ పేర్కొన్నారు.
‘రజాకార్’ సినిమాను తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. గూడూరు నారాయణరెడ్డి చిత్ర నిర్మాత కాగా, యాట సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం పూర్తిగా.. హిందువుల మీద రజాకారులు సాగించిన దౌర్జన్యాలనే ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాశ్మీరీ పండిట్లపై ఒకప్పట్లో జరిగిన అరాచకాల పేరుతో రూపొందిన కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ఒకరకంగా పెద్ద సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అదే తరహాలో ‘రజాకార్’ చిత్రం కూడా రూపొందుతోందని పలువురు భావిస్తున్నారు.
కాశ్మీర్ ఫైల్స్ కంటే అధికంగా హిందూ ముస్లిం విద్వేషాలను రెచ్చగొట్టడానికి, సమాజాన్ని రావణకాష్టంగా మార్చడానికి ఇది కారణం కావచ్చునని పలువురు విశ్లేషిస్తున్నారు.