భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఎపిసోడ్లో మరో సంచలనం. హత్యకు దారి తీసిన పరిస్థితులపై నాగరామకృష్ణ చనిపోవడానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఇవాళ బయట పడింది. ఈ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు దుర్మార్గపు చేష్టల వల్లే తాము కుటుంబంతో సహా ఆత్మ హత్యకు పాల్పడాల్సి వస్తోందని రామకృష్ణ ఆవేదనతో చెప్పడం సభ్య సమాజాన్ని కలచివేస్తోంది.
ఏ భర్త వినకూడని మాటను వినాల్సి వచ్చిందని, అందుకే ఈ లోకాన్ని శాశ్వతంగా వీడాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నాగరామకృష్ణ సెల్ఫీ వీడియోలో ఏమున్నదో తెలుసుకుందాం.
‘రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. ఇటీవల ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని కోరారు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు. తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిలో నా భాగాన్ని విక్రయించి నా అప్పులను తీర్చాలి’ అని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాలు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటి ముందు ధర్నాకు దిగాయి. వెంటనే ఎమ్మెల్యే, ఆయన కుమారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.
నాగరామకృష్ణ సెల్ఫీ వీడియోతో వనమా రాఘవేంద్ర దురాగతాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. వనమా రాఘవేంద్ర సంబంధీకులు గత రాత్రి తనకు ఫోన్ చేసి బెదిరించినట్టు నాగరామకృష్ణ బామ్మర్ది వాపోయాడు.