ఏ చిన్న అవకాశం దొరికినా మోడీ సర్కార్‌కు అండగా నిలిచి, తన విధేయత చాటుకోడానికి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వేచి చూస్తుంటారు. ఆ అద్భుత అవకాశం రానే వచ్చింది. దీంతో ఆమె మోడీపై తన అపారమైన గౌరవాభిమానాల్ని ప్రదర్శించారు. పంజాబ్‌లో రైతుల నిరసనతో ప్రధాని మోడీ పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీకి చేరుకోవడం వివాదాస్పదమైంది.
భద్రతా వైఫల్యం వల్లే నరేంద్రమోడీ పంజాబ్ పర్యటనలో చేదు అనుభవాన్ని రుచి చూడాల్సి వచ్చిందని కేంద్రహోంశాఖ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన మార్క్ విమర్శలను ఎక్కు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు.
‘పంజాబ్‌లో ప్రధాని మోడీని అడ్డుకోవడం సిగ్గుచేటు. ప్రధాని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు. 140 కోట్ల జనాభాకు మోడీ ప్రతినిధి. ఆయనపై దాడి అంటే అది ప్రతి ఒక్క భారతీయుడిపై దాడిగా పరిగణించాలి. ఇది ముమ్మాటికీ మన ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి. పంజాబ్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది. వెంటనే వాటిని అరికట్టకపోతే.. దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అంటూ ఇన్‌స్టాగ్రాం వేదిగా తనదైన శైలిలో కంగన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే bharatstandswithmodiji అనే హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేశారామె.
మరోవైపు ప్రధాని మోడీ పర్యటనలో ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ చన్నీ అన్నారు. చివరి నిమిషంలో రోడ్డు మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించడం వల్లే ఈ విధంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని పర్యటన రద్దు కావడంతో ఘోరమేదో జరిగిపోయిందని బీజేపీ రచ్చ చేస్తుండడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఏంటీ…నిరసనకే ప్రాణాలతో బయట పడ్డారా? మరి..రోడ్లపై ఇనుప మేకులు దింపి అడ్డుకున్నప్పుడు రైతులు అనుభవించిన బాధ తెలియలేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే ర్యాలీపై జీపులతో తొక్కించి ప్రాణాలను తీసినప్పుడు, చలికీ.. వానకీ.. టెంట్లలోనే మగ్గినప్పుడు ..ఈ ప్రాణాలు గుర్తు రాలేదా? అని మోడీ సర్కార్‌ను నిలదీస్తూ కామెంట్స్ పెట్టారు.
ఓ… వాళ్లవి ప్రాణాలు కాదు.. మీవి మాత్రమే ప్రాణాలు కదూ ! అంటూ బీజేపీ పెద్దల్ని నెటిజన్లు తమదైన సృజనాత్మక ధోరణిలో ట్రోల్ చేయడం గమనార్హం. ప్రాణాలంటే కేవలం ప్రధానివే కావని, రైతులవి కూడా అని గుర్తించాలని నెటిజన్లు హితవు చెప్పడం విశేషం.