మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఓ న్యాయం, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకైతే మరో న్యాయమా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇదెక్కడి న్యాయం కేసీఆర్? అంటూ నిలదీస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది.
పాల్వంచలో నాగరామకృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలకు నిప్పు పెట్టి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్ర దుర్మార్గపు విధానాల వల్లే తాను కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడాల్సి వస్తోందని ఆయన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.
ఇదే తన కేబినెట్ మంత్రివర్గంలో ఉన్న ఈటల రాజేందర్‌పై భూముల ఆక్రమణకు సంబంధించి ఫిర్యాదు రాగానే యుద్ధ ప్రాతిపదికన స్పందించిన కేసీఆర్… ఇప్పుడు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే వనమా కుమారుడి దుశ్శాసన పోకడలపై ఎందుకు నోరు మెదపడం లేదనే నిలదీతలు ప్రతిపక్షాలు, పౌర సమాజం నుంచి వస్తున్నాయి. తాను కక్ష కట్టిన మంత్రిపై ప్రతీకారం తీర్చు కోవడంలో ఉన్న శ్రద్ధాసక్తులు, మహిళల మానప్రాణాలు హరించే నాయకుడి ఆట కట్టించడంలో ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నారు.
వనమా రాఘవకు అధికార పార్టీ వత్తాసు పలకడం దుర్మార్గమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. అతని కీచక చేష్టలకు ఓ కుటుంబంబలైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగి 3 రోజులైనా చర్యలెందుకు తీసుకోలేదని రేవంత్‌రెడ్డి నిలదీయడం గమనార్హం. ఎమ్మెల్యే కుమారుడి అరాచకాలు సీఎం కేసీఆర్‌కు తెలియవా అని రేవంత్ నిలదీశారు.