తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి కుప్పానికి వెళ్లారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయాకా… చంద్రబాబు గారు ఇదే మొదటిసారి అక్కడకు వెళ్లడం లాగుంది. అయితే మున్సిపాలిటీని ఓడాకా ఇదే తొలిసారేమో కానీ, ఈ మధ్యకాలంలో వీలైనప్పుడల్లా కుప్పానికి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు.
కుప్పంలో టీడీపీ కూసాలు కదిలిపోతున్నాయనే వార్తలు వచ్చిన ప్రతి సారీ ఈయన అక్కడకు వెళ్తున్నారు. కుప్పంలో ప్రజెంట్ వేయించుకుని, తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు ఈ పాట్లన్నీ పడుతున్నారు. అయితే ఈయన అక్కడకు వెళ్లడం, రెండు మూడు రోజుల పాటు ఏదో మంత్రాంగం నడపడం, జనం ముందు సానుభూతి పొందేందుకు ఏవో కొన్ని డైలాగులు కొట్టడం జరుగుతోంది కానీ, కుప్పంలో టీడీపీ పరిస్థితి మాత్రం రోజు రోజుకూ దిగజారి పోతున్నట్టుగా ఉంది!
సరిగ్గా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పానికి వెళ్లారు. అక్కడ అభ్యర్థులను పరిచయం చేశారు. వారిని గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. అయితే ఆ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులంతా చిత్తు చిత్తుగా ఓడారు! అదేమంటే.. ఎన్నికల బహిష్కరణ అంటూ కవర్ చేసుకునే విఫలం యత్నం చేశారు. అభ్యర్థులను తనే ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసి, వారిని గెలిపించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు చివర్లో ఇచ్చిన బహిష్కరణ పిలుపుతో డ్యామేజ్ కవరేజ్ చేసుకునే యత్నం చేశారు.
అయితే కుప్పం మున్సిపాలిటీ ఎన్నికను మాత్రం టీడీపీ బహిష్కరించలేదు. ఈ మున్సిపాలిటీ ఎన్నిక ముందు కుప్పానికి వెళ్లి.. జగన్ కు ధైర్యముంటే కుప్పం రావాలంటూ సవాళ్లు విసిరారు. సెంటిమెంట్ రేపే వ్యాఖ్యలేవో చేశారు. అయితే అవేవీ ఫలించలేదు. లోకేష్ కూడా రంగంలోకి దిగి కుప్పంలో ఏదేదో చేశారు. అయితే దబిడిదిబిడే అయ్యింది. కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ చిత్తయ్యింది.
అయినప్పటికీ.. కుప్పం చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి కారణం.. వచ్చే ఎన్నికల్లో మరెక్కడో పోటీ చేసే అవకాశం లేకపోవడమే లాగుంది. మరో నియోజకవర్గంలో ఛాన్స్ ఉన్నట్టైతే చంద్రబాబు ఈ పాటికి కుప్పం ప్రజలను బహిరంగంగా తిట్టడం మొదలుపెట్టే వారనడంలో సందేహం లేదు. కుప్పం జనాలకు తనపై విశ్వాసం లేదని.. అందుకే వేరే చోట నుంచి పోటీ అంటూ రచ్చ చేసేవారు చంద్రబాబు.
అయితే కుప్పం నుంచి కాకుండా.. ఇంకో నియోజకవర్గం నుంచి పోటీ అంటూ చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెడితే, టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా అది ఝలక్ అవుతుంది. చంద్రబాబుకే గెలుపుపై నమ్మకం లేదని, అందుకే మరో చోట నుంచి పోటీ చేస్తున్నారనే అభిప్రాయాలు బలంగా వెళ్లిపోతాయి. అది టీడీపీని రాష్ట్ర వ్యాప్తంగా ఓడించగలదు.
అందుకే కుప్పం లో పోటీ చేయడం తప్ప చంద్రబాబుకు ఇంకో ప్రత్యామ్నాయం లేదు. పోటీ చేస్తే గెలుపుకోసం అపసోపాల పడాల్సిందే. అవే చేస్తున్నారిప్పుడు చంద్రబాబు. మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించి, జనాలకు తను ఉన్నట్టుగా గుర్తించమని వేడుకునేలా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెలుపుకు ఇప్పటి నుంచి కసరత్తు తీవ్ర స్థాయికి చేరుస్తున్నట్టున్నారు! రాజకీయ జీవిత చరమాంకంలో ఎమ్మెల్యేగా గెలిచేందుకు చంద్రబాబు పడుతున్న పాట్లు ఈ రేంజ్ లో ఉన్నాయి!