ఎట్టకేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ అయ్యారు. తమ సమస్యలను సీఎం ఎదుట ఏకరువు పెట్టారు. తమతో సీఎం జగన్ ఆత్మీయంగా మాట్లాడినట్టు ఉద్యోగ సంఘాల నాయకులు మీడియాకు చెప్పారు. పీఆర్సీ, ఫిట్‌మెంట్‌పై సీఎం సానుకూల నిర్ణయం తీసుకుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. వీటి కంటే ముఖ్యంగా తమతో సీఎం ఆత్మీయంగా అన్న మాటలకు ఉద్యోగ సంఘాల నాయకులు ఫిదా అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనకంటే వయసులో పెద్దవారిని అన్నా అని పలకరిస్తూ జగన్ మాట్లాడిన తీరుకు ఉద్యోగ సంఘాల నేతలు మురిసిపోయారు.
“నేను కూడా మీ అందరి కుటుంబ సభ్యుడినే. మనసా, వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నా. దయచేసి మీరందరూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా” అని జగన్ అనడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఒక రకమైన ఉద్వేగానికి లోనైనట్టు సమాచారం.
71 డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులు పర్మినెంట్ చేయడం, 55 శాతం ఫిట్మెంట్ తదితర డిమాండ్లు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కేవలం సీఎం మాత్రమే పరిష్కరించగలరని, ఆయన్ను కలిసేందుకు ఒక్కసారి అవకాశం కల్పించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారి డిమాండ్ ఎట్టకేలకు నేటితో నెరవేరింది.
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఒక్కో ఉద్యోగ సంఘం నాయకుడు తమ సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. నాయకులు చెప్పే ప్రతి అంశాన్ని స్వయంగా జగన్ నోట్ చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యోగ సంఘాల నేతలందరి అభిప్రాయాలు విన్న తర్వాత జగన్ మాట్లాడినట్టు సమాచారం.
ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగే అంత మంచి చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామన్నారు, మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోయ లేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని ఉద్యోగ సంఘాల నేతల్ని సీఎం కోరడం గమనార్హం. ఉద్యోగుల కుటుంబ సభ్యుడిగా అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని సీఎం సానుకూల దృక్పథంతో మాట్లాడారు. 2, 3 రోజుల్లో దీనిపై ప్రకటన ప్రకటన చేస్తామని సీఎం స్పష్టం చేశారు.