మోడీ వ్యవహారం ఆ కథలాగే ఉన్నది మరి!

ముందుగా ఒక కథ. ‘‘ఏదో సందర్భంలో తెగ కోపం వచ్చేసి, అసలే కోపిష్టి అయిన శివుడు బ్రహ్మ తలను తెగనరికాడు. ఆ తల.. పరమశివుడి వేలికి అంటుకుందిట. దాన్ని ఎంత వదిలించుకుందాం అనుకున్నా అది…

ముందుగా ఒక కథ. ‘‘ఏదో సందర్భంలో తెగ కోపం వచ్చేసి, అసలే కోపిష్టి అయిన శివుడు బ్రహ్మ తలను తెగనరికాడు. ఆ తల.. పరమశివుడి వేలికి అంటుకుందిట. దాన్ని ఎంత వదిలించుకుందాం అనుకున్నా అది వీడిపోలేదు. ఏమేమో చేశాడు. ఎక్కడెక్కడో తిరిగాడు. ఆయన ఉపాయాలేవీ పనిచేయలేదు. అలా దాన్ని వదిలించుకోవడానికి ఊరూరా తిరిగే ప్రయత్నంలో కాశీకి వచ్చాడు. కాశీలో ప్రవేశిస్తుండగా.. తల వేలినుంచి విడిపోయి ఊరి సరిహద్దు దగ్గర ఉండిపోయింది. హమ్మయ్య విముక్తి వచ్చింది అనుకున్నాడు శివుడు. కొన్నాళ్లు కాశీలో ఉండి.. తిరిగి కైలాసానికి వెళ్లబోతుండగా.. ఊరి సరిహద్దు దాటగానే.. బ్రహ్మ తల మళ్లీ వచ్చి అతుక్కుంది. విజ్ఞులు అది బ్రహ్మహత్యాపాతకం వదిలిపోయేది కాదు.. కాశీక్షేత్రంలో ఉంటే అది అంటదు అని చెప్పారు. అందుకని.. పరమశివుడు పాపం, కైలాసాన్ని వదిలేసి కాశీలోనే ఉండిపోయాడు.’’

ఇదీ కథ. కాశీ గురించి అది చాలా గొప్ప శైవ క్షేత్రమని, శివుడు అక్కడ స్వయంగా వెలిశాడని అంటూ.. మన పెద్దలు చెబుతూఉంటారు. అలాంటి కాశీక్షేత్రం నుంచి ఎంపీగా గెలిచిన నరేంద్రమోడీకి.. కాశీ విశ్వనాధుడి ఆలయానికి వైభవ స్థితిని కల్పిస్తూ ఇటీవలే కాశీవిశ్వనాథ్ కారిడార్ ను కూడా ప్రారంభించిన ప్రధానికి లఖింపూర్ ఖేరి ఘటనలో రైతులను హతమార్చిన బ్రహ్మహత్యాపాతకం మాత్రం ఒకపట్టాన వదిలిపోవడం లేదు. 

ఆ హత్య ఆయన స్వయంగా చేసినది కాకపోవచ్చు. కానీ.. ఆ హత్యకు కారకులైన వారిని కాపడుతూ.. వారి మీద చర్యతీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తూ, ఉపేక్ష ధోరణిని అవలంబించడం కూడా బ్రహ్మహత్యాపాతకమే అవుతుంది. ఆ పాతకమే.. ఆయననున పంజాబ్ దాకా వెన్నాడింది. హుసేనీవాలాకు వెళ్లకుండా ఫిరోజ్ పూర్ నుంచే వెనుతిరిగి ఢిల్లీకి వెళ్లిపోయే పరిస్థితిని కల్పించింది.

లఖింపూర్ ఖేరీ లో శాంతియుతంగా ఏడాదిపాటు తమ వ్యతిరేకత, వేదన, నిరసనలను తెలియజేస్తున్న రైతుల మీదికి అరాచకంగా కారు నడిపి.. వారిని హత్యచేసిన దుండగుడు.. సాక్షాత్తూ కేంద్రమంత్రి అజయ్ మిశ్ర కుమారుడు. ఈ వ్యవహారంలో రైతుల దీక్షలపై, పోరాటంపై మంత్రి అజయ్ మిశ్ర ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు. ఆయన పర్యటన సందర్భంగా దీక్ష చేస్తున్న రైతులు నల్లజెండాలు చూపించినందుకు.. ‘నేను వారికి నా సత్తా చూపించదలచుకుంటే.. వారు వారి గ్రామాలనుంచి మాత్రమే కాదు, జిల్లానుంచి కూడా వెళ్లిపోవాల్సి వస్తుంది’ అని అజయ్ మిశ్ర అన్నారు. తండ్రి ఆ మాట అంటే.. కొడుకు ఏకంగా వారిని ఈ లోకంనుంచే పైకి పంపేశాడు. 

బీజేపీ పాలనలోనే ఉన్న యూపీ ప్రభుత్వం నియమించిన సిట్ కూడా.. అజయ్ మిశ్ర కుమారుడు తప్పు చేసినట్లు అభిప్రాయపడింది. ఇంత జరుగుతుండగా.. నరేంద్ర మోడీ తన కేబినెట్ లోని మంత్రిపై చర్య తీసుకోకుండా ఉపేక్ష వహిస్తే ఎలా సబబు అనిపించుకుంటుంది. రైతులు లఖింపూర్ ఖేరి ఘటనలపై నిరసన తెలియజేయడం తప్పా? మంత్రిపై చర్య తీసుకోనంత వరకు.. లఖింపూర్ ఖేరి అనేది మోడీ తాను ఎక్కడకు వెళ్లినా.. చివరకు కాశీకి వెళ్లినా కూడా బ్రహ్మహత్యాపాతకం లాగా ఆయనను చుట్టుకునే ఉంటుందని తెలుసుకోవాలి.