అవకాశాలొస్తున్నాయి. వాటికి తగ్గట్టు బాగా కష్టపడుతోంది కూడా. కానీ అవకాశాలతో కూడా అదృష్టం కూడా కలిసిరావాలి. అలాంటి అదృష్టానికి అడుగు దూరంలో ఆగిపోతోంది రకుల్. ఆమె బాలీవుడ్ ఆశలు ఎప్పటికప్పుడు పాలపొంగులా ఇలా పొంగి అలా ఠక్కున చల్లారిపోతున్నాయి. ఇప్పుడు కరోనా/ఒమిక్రాన్ రూపంలో రకుల్ బాలీవుడ్ కలలు మరోసారి కరిగిపోతున్నాయి.
దాదాపు రెండేళ్లుగా ఆమె బాలీవుడ్ ప్రాజెక్టులపైనే ఫోకస్ పెట్టింది. ఎటాక్, రన్ వే 34, డాక్టర్ జి, థ్యాంక్ గాడ్ అనే 4 సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ పూర్తిచేసింది. వాటి విడుదల తేదీలు కూడా దశలవారీగా ఎనౌన్స్ అయ్యాయి. ఇవన్నీ థియేటర్లలోకొస్తే రకుల్ పేరు బాలీవుడ్ లో బాగా వినిపించేది. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఆమెకు కాస్త క్రేజ్ పెరిగేది. కానీ థర్డ్ వేవ్ వచ్చింది. రకుల్ ఆశలపై నీళ్లుచల్లింది. ఆమె నటించిన సినిమాల్లో ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతాయో, ఎన్ని నేరుగా ఓటీటీకి వెళ్లిపోతాయో చెప్పలేని పరిస్థితి.
2014లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రకుల్. కానీ ఆ తర్వాత ఆమె పూర్తిగా హిందీ సినిమాలకు దూరమైంది. మళ్లీ 2019లో వచ్చిన దేదే ప్యార్ దే సినిమా రకుల్ కు కాస్త గుర్తింపు తీసుకొచ్చింది. ఇక అక్కడ్నుంచి అడపాదడపా ఆమె హిందీలో సినిమాలు చేస్తూనే ఉంది. అయితే ఈసారి మాత్రం ఆమె పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. హిందీలో కనీసం ఒక్క సినిమా క్లిక్ అయినా, సౌత్ కు గుడ్ బై చెప్పేద్దామనే ఆలోచనలో ఉంది. కానీ థర్డ్ వేవ్ రకుల్ ప్లాన్స్ కు స్పీడ్ బ్రేకర్ గా నిలిచింది.
ప్రస్తుతం నార్త్ లో కొనసాగుతున్న పరిస్థితిపై విచారం వ్యక్తంచేసింది రకుల్. పరిశ్రమపై మరోసారి గట్టిగా ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడింది. చాలామంది సినిమాలపై డబ్బులు పెట్టి ఎదురుచూస్తున్నారని, చాలా కుటుంబాలు సినిమాపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపిన రకుల్.. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రార్థించడం తప్ప మరేం చేయలేమని అంటోంది. ప్రజలంతా భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేస్తోంది.