పవన్ కల్యాణ్.. ఏపీ రాజకీయాల్లో త్యాగరాజు అవుతారా!

బీజేపీ, జనసేన మిత్ర పక్షాలు. కానీ ఎవరికి వారు తామే గొప్ప అనుకునే రకం. బీజేపీ తమ అవకాశాలన్నిటినీ తీసుకుంటోందని, జనసేనకు తనని తాను నిరూపించుకునే ఛాన్స్ లేకుండా పోయిందనేది పవన్ అభిమానుల ఆవేదన.…

బీజేపీ, జనసేన మిత్ర పక్షాలు. కానీ ఎవరికి వారు తామే గొప్ప అనుకునే రకం. బీజేపీ తమ అవకాశాలన్నిటినీ తీసుకుంటోందని, జనసేనకు తనని తాను నిరూపించుకునే ఛాన్స్ లేకుండా పోయిందనేది పవన్ అభిమానుల ఆవేదన. ప్రతిసారీ పొత్తు ధర్మాలను పాటిస్తూ త్యాగాలను అలవాటు చేసుకున్నారు జనసైనికులు. 

పవన్ కూడా చివరి వరకూ బరిలో నిలుస్తామంటూ ప్రగల్భాలు పలికి, ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే అంతా మీ ఇష్టం అంటూ పక్కకు తప్పుకుంటున్నారు. కానీ పవన్ ఆలోచన వేరేగా ఉంది. ప్రస్తుతం ఎన్ని త్యాగాలు చేసినా 2024 ఎన్నికల్లో మాత్రం అత్యథిక సీట్లలో పోటీ చేయాలనేది పవన్ ప్లాన్. అందుకే పార్టీ శ్రేణులతో గ్రౌండ్ వర్క్ చేయిస్తున్నారు.

పవన్ ఆశలపై నీళ్లు..

ఇప్పటి వరకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తే.. 2024లో ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ కంటే జనసేనలోనే కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న నేతలు కనిపిస్తారు. క్షేత్ర స్థాయిలో జనాల్లోకి వెళ్లినవారు కానీ, జనంతో కలసి తిరిగిన వారు కానీ జనసేన నుంచే ఉన్నారు. కానీ వారికి ఆర్థిక అండదండలు అంతంతమాత్రమే. 

పవన్ నుంచి వచ్చే సపోర్ట్ కూడా ఏదీ ఉండదు. అయినా కూడా పోటీకి వారు ఉత్సాహంగానే ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితుల్లో మార్పులొస్తున్నాయి. పవన్ ఆలోచనకు గండి పడేలా ఉంది. ఏపీలో బీజేపీ దూకుడు చూస్తుంటే జనసేన వాటా సీట్లను బాగా తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు అర్థమవుతోంది.

సొంతంగా బలపడదాం..

కలసి నడుద్దాం, కలసి పోరాటాలు చేద్దామంటూ చాన్నాళ్లుగా జనసేన, బీజేపీ చెబుతున్నా.. ఎక్కడా అలాంటి కలగలుపు సన్నివేశాలు కనపడలేదు. అంతా కలగాపులగమే. తీరా ఇప్పుడు ఎన్నికలు రెండేళ్లలోకి వచ్చేసరికి బీజేపీ దూకుడు పెంచింది. ఏపీలో సొంతగా బలపడే ప్రయత్నాలు మొదలు పెట్టింది. బలపడటం కంటే ముందు ఏపీలో బీజేపీ అనే చీప్ లిక్కర్ పార్టీ ఒకటి ఉందని, ఆ పార్టీకి ఓటేస్తే.. మందు రేట్లు భారీగా తగ్గిపోతాయనే ఇమేజ్ తీసుకొచ్చారు. మంచో, చెడో అది జనాల్లోకి వెళ్లిపోయింది, తాగుబోతుల మైండ్ లో కమలం పువ్వు రిజిస్టర్ అయింది. ఇక దాన్ని ఎలా పెంచి పోషించాలనేదే వారి ఆలోచన.

చీప్ లిక్కర్ తో మొదలైన ఈ వ్యవహారం కాస్తా.. ఇప్పుడు బాగా ముదిరిపోయింది. ఎడా పెడా వీర్రాజు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒక హడావిడి చేస్తున్నారు. తెలంగాణలో లాగా ఏపీలో కూడా పార్టీ దూకుడుగా వెళ్లాలని అధిష్టానం నుంచి కూడా ఆదేశాలందాయి. దీంతో పవన్ కి చెక్ పెట్టాలన్నా, జనసేనని డామినేట్ చేయాలన్నా.. బీజేపీ నేతలు స్పీడ్ పెంచాల్సిన సందర్భం. ఇప్పుడుకాక ఇంకెప్పుడు అనేలా వ్యవహరిస్తోంది కాషాయదళం. జనసేనని కలుపుకోకుండా పెట్టిన ప్రజా ఆగ్రహ సభ కూడా అందులో భాగమే.

సడన్ గా బీజేపీ జనాల్లోకి వెళ్లడం, సభలు, సమావేశాలతో హడావిడి చేయడంతో జనసేనకి ఏదో కీడు శంకిస్తోంది. ఇదే హడావిడి ఎన్నికల వరకు కొనసాగించి.. తమకు రావాల్సిన సీట్లలో కోత పెడతారేమోనని జనసైనికులు, జనసేన టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు భయపడుతున్నారు. మరి ఈ భయం పవన్ కి కూడా ఉందా.. లేదా తన త్యాగరాజు బిరుదుని పవన్ మరోసారి సార్థకం చేసుకుంటారా? వేచి చూడాలి.