దక్షిణాదిన సూపర్ హిట్ అయిన కాంచన సినిమా హిందీ రీమేక్ పలు వివాదాల్లో నానుతూ ఉంది. ఒకవేళ అక్షయ్ కుమార్ కాకుండా మరో హీరో ఈ సినిమా హిందీ వెర్షన్లో నటించి ఉంటే, ఇంకా రచ్చ తీవ్రంగా ఉండేదని స్పష్టం అవుతోంది.
ఇప్పటికే ఈ సినిమా విషయంలో లవ్ జిహాద్ తదితర వివాదాలు కూడా రేగాయి. ఇక టైటిల్ విషయంలో కూడా కొన్ని రైట్ వింగ్ గ్రూపులు తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి!
'లక్ష్మీ బాంబ్' అనే టైటిల్ పై వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అప్పటికే సెన్సార్ కూడా అయినప్పటికీ సినిమా టైటిల్ ను మార్చారు. ఈ సినిమాను లక్ష్మీగా విడుదల చేస్తారట! ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడం లేదు. కేవలం డిస్నీ-హాట్ స్టార్ లో మాత్రమే విడుదల కానుంది. అయినా వివాదాన్ని పెంచకుండా సినిమా టైటిల్ ను మార్చేశారు.
వాస్తవానికి ఈ సినిమా ఆరంభం నుంచి వివాదాలు రేగాయి. ముందుగా ఈ సినిమాకు దర్శకుడిగా లారెన్స్ పేరునే ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ప్రమేయం లేకుండా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారట. దీంతో ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టుగా లారెన్స్ ప్రకటించాడు.
చివరకు అక్షయ్ కుమార్ రంగంలోకి దిగి లారెన్స్ ను మళ్లీ రంగంలోకి దించాడు. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లోనే విడుదల కావాల్సింది. అప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.
కరోనా లాక్ డౌన్ తో ఈ సినిమా ఆగింది. ఓటీటీ సంస్థలు దీన్ని విడుదల చేయడానికి ఏప్రిల్ నుంచినే ఆసక్తిని చూపించాయి. అయితే థియేటర్లలోనే విడుదల చేయాలనే లక్ష్యంతో దీన్ని ఓటీటీలకు ఇవ్వకుండా చాన్నాళ్లు ఆపారు.
చివరకు చేసేది లేక ఇప్పుడు ఓటీటీ లోనే విడుదల చేస్తున్నారు. సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి కథ, కథనాలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. టైటిల్ కూడా మారిపోయింది.