గీతం విద్యా సంస్థల భూముల విషయంలో మొదలైన వివాదం ఎటు దారితీస్తుందో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. నిజానికి గీతం విద్యా సంస్థలను డీమ్డ్ టు బి వర్సిటీగా యూజీసీ గుర్తించింది. అయితే గీతంకి ఈ అనుమతులు రద్దు చేసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అలుపెరగని పోరాటమే చేస్తున్నారు.
ఇప్పటికే గీతం విద్యా సంస్థల భూ ఆక్రమణల గురించి జాతీయ వైద్య మండలికి ఫిర్యాదు చేసిన ఆయన ఇపుడు యూజీసీకి, కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ ప్రొక్రియాన్ కి కూడా లేఖలు రాయడం చర్చనీయాంశం అయింది.
ఆ లేఖలలో పేర్కొన్న అంశాలు తీవ్రంగానే ఉన్నాయి. నిజానికి యూజీసీ నిబంధనల మేరకు వివాదస్పదం కాని భూముల్లోనే విద్యా సంస్థలు ఏవైనా కూడా నిర్మాణాలు ఉండాలి. వాటికి పక్కాగా డాక్యుమెంట్లు కూడా చూపించాలి. మరి గీతం వాటిని చూపించిందా అన్నదే విజయసాయిరెడ్డి ప్రశ్న.
ఇక గీతం ప్రభుత్వ భూములను ఆక్రమించి చాలా నిర్మాణాలు చేపట్టింది కాబట్టి డీమ్డ్ వర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా గీతం విద్యా సంస్థలను విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ అనుబంధం చేయాలని కూడా కోరడం విశేషం.
నిజంగా ఆ పని జరుగుతుందా అన్నది ఇక్కడ చర్చగా ఉంది. దాదాపుగా వందేళ్ళ చరిత్ర కలిగిన ఏయూని పక్కకు పెట్టి మరీ తాను ఎదిగిపోవాలని చూసిన గీతం ఇపుడు అదే ఏయూకు అనుబంధం అయితే మాత్రం భారీ ట్విస్ట్ గానే చూడాలి. మరి వైసీపీ చేస్తున్న ఈ పోరాటం ఎంత దూరం వెళ్తుందో, గీతం తలరాత ఎలా ఉందో వేచి చూడాల్సిందే.