తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు మూడేళ్ల నుంచి రాజకీయాల్లోకి వచ్చినట్టుగా, వచ్చేస్తున్నట్టుగా, ఆల్రెడీ వచ్చినట్టుగా రకరకాల మాటలు చెబుతూ వస్తున్నారు. జయలలిత మరణానంతరం రజనీ పొలిటికల్ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
అందుకు తగ్గట్టుగా ఆధ్యాత్మిక రాజకీయం అంటూ రజనీకాంత్ ఎవరికీ అర్థం కాని విషయాన్ని చెప్పారు. ఆయన అప్పట్లో ఏదో పార్టీని కూడా రిజిస్టర్ చేయించినట్టుగా ఉన్నారు. కానీ దాని యాక్టివిటీస్ మాత్రం లేవు.
అభిమానులతో సమావేశాలు నిర్వహించి, ఆ సమావేశాల్లో ఏమీ తేల్చలేదు రజనీకాంత్. ఆ క్రమంలో.. రజనీ రాజకీయాల్లోకి వచ్చినట్టా, రానట్టా అనేది ఆయన అభిమానులకే అంతుబట్టని అంశంగా మారింది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల సమయంలో రజనీకాంత్ స్పందించలేదు.
బీజేపీకి మద్దతు కూడా ప్రకటించలేదు. తన పార్టీని బరిలో నిలపలేదు. ఇక మరో ఆరేడు నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రజనీ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇలాంటి నేపథ్యంలో రజనీకాంత్ రాసినదిగా చెప్పబడుతూ సోషల్ మీడియాలో ఒక లేఖ స్వైర్యవిహారం చేసింది. దాని ప్రకారం.. రజనీ రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఆయన వయసు 70 సంవత్సరాలు, ఇప్పటికే కిడ్నీ మార్పిడి జరిగింది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితుల్లో వైద్యులు గట్టి సూచన చేశారట.
ఎన్నికల ప్రచారం అంటూ, మరోటి అంటూ జనాల్లోకి వెళ్లి కరోనా గనుక సోకితే చికిత్స అందించడం కూడా కష్టం అవుతుందని వైద్యులు రజనీకి చెప్పారట. ఒకవేళ కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనలాంటి వారిపై అది పని చేయడం కూడా కష్టమే అని వైద్యులు తేల్చి చెప్పినట్టుగా, అందుకే రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ ఉండకపోవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు.
అయితే అది తను రాసింది కాదని రజనీకాంత్ స్పష్టతను ఇవ్వడంతో కథ మరో మలుపు తిరిగింది. కానీ తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని రజనీకాంత్ స్పష్టం చేశారు. కరోనా భయాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లవద్దని కూడా డాక్టర్లు చెప్పింది వాస్తవమే అని రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. బహుశా సూపర్ స్టార్ ప్రత్యక్ష రాజకీయం ఏదీ ఒక ఉండబోదు అనే అంశం గురించి ఇలా క్లారిటీ ఇచ్చినట్టేనేమో! అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.