పోలవరం పనులు 70 శాతం పూర్తయ్యాయంటూ టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటుంటారు. 30 శాతం నిధులు ఖర్చు చేసి, 70 శాతం పనులయ్యాయని చెప్పడం ఏంటని వైసీపీ లాజిక్ తీస్తే మాత్రం సైలెంట్ అయిపోతారు. పోనీ మీ అనుకూల మీడియాలోనే 70శాతం పనులు చూపించొచ్చు కదా అంటే దానికీ వెనకడుగే.
అసలు పోలవరం దగ్గరకు వచ్చి వైసీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం టీడీపీ నేతలకు లేనే లేదు. తాజాగా టిడ్కో వ్యవహారంలో కూడా టీడీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడింది.
మా హయాంలో 6 లక్షల ఇళ్లు పేదల కోసం నిర్మించాం. వాటిని సంక్రాంతిలోగా లబ్ధిదారులకు కేటాయించకపోతే ఉద్యమం చేస్తాం, ధర్నాలకు దిగుతాం, ఆక్రమించుకుంటాం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు. ప్రజల్ని రెచ్చగొట్టే ఈ వ్యాఖ్యలపై వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. నిర్మాణం పూర్తైపోయిన ఇళ్లను చూపిస్తే, వెంటనే వాటిని లబ్ధిదారులకు అందిస్తామంటూ సవాల్ విసిరింది.
ఈ సవాల్ స్వీకరించే దమ్ము టీడీపీ నేతలకు లేదు. ఎందుకంటే.. రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో అపార్ట్ మెంట్లు… అందమైన రంగుల్లో కనిపిస్తున్నా.. లోపల నిర్మాణ పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయనేది వాస్తవం. చంద్రబాబు తాను అధికారంలో నుంచి దిగిపోయే టైమ్ కి 3,200 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయి ఉంచారు. ఆ బాకీ వైసీపీ తీరుస్తోంది. పోనీ పని అయినా పూర్తయిందా అంటే అదీ లేదు.
కేంద్రం 7లక్షల ఇళ్లు మంజూరు చేస్తే, అందులో 3లక్షల ఇళ్లకు కేవలం పునాది మాత్రమే పడింది. 2.5 లక్షల ఇళ్లు కేవలం బేస్ మెంట్ వరకు వచ్చి ఆగిపోయాయి. ఆవు, దూడ తెచ్చి.. లబ్ధిదారులతో కలసి దేవుడి పటాలతో చంద్రబాబు గృహప్రవేశం చేసింది అరకొర నిర్మాణం అయిన ఇళ్లలోనే. గృహప్రవేశాలు చంద్రబాబు హయాంలోనే అయ్యాయి కదా, అప్పుడే వాటి తాళాలు లబ్ధిదారులకు అందించొచ్చు కదా?
నిర్మాణం పూర్తి కాకముందే ఎన్నికల స్టంట్ లో భాగంగా గృహప్రవేశాలు చేశారు బాబు. ఆ తర్వాత వాటిని పూర్తిగా గాలికొదిలేశారు. ఇలా 20శాతం పనులు మిగిలి ఉన్న ఇళ్లు 81,040. అంటే 6లక్షల ఇళ్లు కాస్తా 80వేలకు తగ్గిపోయాయి. వాటికి కూడా ప్యాచ్ వర్క్ లు చేయాలి. మరి చంద్రబాబు కట్టిన 6లక్షల ఇళ్లు గాలికి ఎగిరిపోయాయా?
నిజంగానే చంద్రబాబుకి తాను చేసిన పనిపై నమ్మకం ఉంటే.. వైసీపీ నేతల సవాల్ కి స్పందించాలి. ఇదిగో చూడండి ఇళ్లన్నీ పూర్తయ్యాయి, నివాస యోగ్యంగా ఉన్నాయి అని చూపించాలి. టీడీపీ అనుకూల మీడియా ఎంతసేపూ అపార్ట్ మెంట్ల ఔట్ లుక్ చూపిస్తుందే కానీ.. లోపల బండారాన్ని బైటపెట్టదు. ఇంటిలోకి వెళ్తే కదా.. అసలుసంగతి బైటపడేది. ఇంకా చెప్పాలంటే అమరావతి గ్రాఫిక్స్ కు, ఈ టిడ్కో ఇళ్లు ఏమాత్రం తీసిపోవు.
అందుకే ఆ వ్యవహారానికి టీడీపీ పూర్తిగా దూరం. కేవలం ప్రజల్ని రెచ్చగొట్టేందుకే టీడీపీ సంక్రాంతి సవాళ్లు చేస్తోంది. వైసీపీ స్పందిస్తే మాత్రం తోకముడుస్తోంది.