ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే పట్టుదల కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ది మాత్రమే కాదు. నిమ్మగడ్డను తిరిగి ఆ చైర్లో కూర్చోబెట్టిన ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ కూడా ఎన్నికలను జరిపించి జగన్‌కు షాక్ ఇవ్వాలని పంతం పట్టారు.
స్థానిక ఎన్నికలు జరగడం వల్ల జగన్ సర్కార్‌కు వచ్చే నష్టమేమీ లేదు. అలాగని ప్రతిపక్షాలకు ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ ఉండదు. పైపెచ్చు ఎన్నికలు జరపాలని గట్టిగా డిమాండ్ చేస్తున్న పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాయో, వాటిలో గెలిచేదెన్నో వాటికే తెలియని స్థితి. అయినప్పటికీ ఎన్నికలు జరపాలని పట్టు పట్టడం వెనుక ఆ పార్టీల ఎత్తుగడలు వేరే.
ఇదే సమయంలో ఎన్నికలు నిర్వహించి తీరాలని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పంతం పట్టడం వెనుక ఉద్దేశం లేకపోలేదు. స్థానిక సంస్థల ఎన్నికలను తమకు మాట మాత్రం కూడా చెప్పకుండా వాయిదా వేయడంతో జగన్ సర్కార్ ఆగ్రహించింది. దీంతో ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించింది. ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కింది.
హైకోర్టులో నిమ్మగడ్డకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకెళ్లింది. అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదు రైంది. ఈ మొత్తం వ్యవహారంలో నిమ్మగడ్డను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా కూర్చోబెట్టడానికి అయిన కోర్టు ఖర్చులు రూ.100 కోట్లకు పై మాటే అని సాక్ష్యాత్తు రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఒక ప్రముఖ చానల్ డిబేట్లో లెక్కలేసి మరీ చెప్పారు.
ఇంత భారీ మొత్తాన్ని నిమ్మగడ్డపైన ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలు పెట్టారంటే …ఏదీ ఆశించకుండా ఉండరనేది బహిరంగ రహస్యం. అలాగే నిమ్మగడ్డ కూడా తన వాళ్ల రుణాన్ని తీర్చుకోవాలని తహతహలాడుతున్నారు. ఇందుకోసం దారులు వెతుకుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని, ఎన్నికలు నిర్వహించడం అంత ఆషామాషీ కాదనే వాస్తవం ఇప్పుడిప్పుడే నిమ్మగడ్డకు కూడా తెలుసొస్తోంది.
ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రూటు మార్చారు. ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నప్పటికీ …. వాళ్ల నుంచి తాను, తనను ప్రోత్సహించే పచ్చ బ్యాచ్ ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రభుత్వంతో నిర్ణయించి ఎన్నికలకు వెళ్లాలని, అలాగే వివాదాలకు తావు లేకుండా నిర్వహించాలనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమయ్యాయే తప్ప … ఇప్పటికిప్పుడే అన్నీ చేయాలని టీడీపీ, దాని మిత్రపక్షం సీపీఐ తప్ప ఏ పార్టీ కూడా డిమాండ్ చేయలేదు.
ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ నిర్ణయాన్ని హైకోర్టుకే వదిలేయాలని నిమ్మగడ్డ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నవంబర్ 2న హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసీ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఏకగ్రీవాల రద్దు, కొత్త నోటిఫికేషన్ తదితర అంశాలపై రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ …. అవి చట్టానికి నిలబడే అవకాశాలు లేవు. రాజకీయ పార్టీలు కోరాయని , వాటికి అనుగుణంగా ఏకగ్రీవాలను రద్దు చేస్తే తిరిగి కొత్త సమస్యను ఎస్ఈసీ సృష్టించినట్టవుతుంది.
తానే ఏకగ్రీవాలకు సంబంధించి ధ్రువపత్రాలు అందజేసి, తిరిగి రద్దు చేస్తే మాత్రం నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మరింత భ్రష్టు పట్టక తప్పదు. అసలే అది ఎన్నికల కమిషన్ కార్యాలయం కాదు… ఎల్లో కమిషన్ కార్యాలయం అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలున్నాయి. వాటికి బలం కలిగించేలా నిమ్మగడ్డ నిర్ణయం తీసుకునే సాహసం నిమ్మగడ్డ చేస్తారని ఎవరూ భావించడం లేదు.