ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు, ఇంకో పార్టీలో చేరి మంత్రి పదవులు అనుభవించడం.. టీడీపీ హయాంలో జోరుగా సాగింది. వలసల్ని ప్రోత్సహించడం అందరూ చేసే పనే. అయితే ఆ వలస వచ్చిన నాయకుల్ని నెత్తిన పెట్టుకుని పార్టీ కోసం పనిచేసినవారిని పక్కనపెట్టడం చంద్రబాబుకి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదు.
ఇలాంటి నీఛాల వల్లే చంద్రబాబు గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవులు వెలగబెట్టిన ఏ ఒక్కరూ రెండో దఫా గెలవలేదంటే వారిని జనం ఎలా చీదరించారో అర్థమవుతుంది. అలాంటిది ఇప్పుడు వైసీపీ హయాంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతోందంటూ టీడీపీ దుష్ప్రచారానికి తెరతీస్తోంది.
విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీలోకి వస్తున్నారని, అలా వచ్చిన వెంటనే ఆయనకు జగన్ మంత్రి పదవి ఇవ్వబోతున్నారని టీడీపీకి చెందిన కొన్ని సోషల్ మీడియా పేజీలు ప్రచారం చేస్తున్నాయి.. ఆ మంత్రి పదవి కూడా అవంతి శ్రీనివాస్ నుంచి వెనక్కి తీసుకుని మరీ ఇస్తారట. ఇంతకంటే దారుణమైన ప్రచారం ఇంకోటి ఉంటుందా.
టీడీపీ ఎమ్మెల్యే కోసం జగన్, తన మంత్రిని బలి చేస్తారంటూ పచ్చపాత సోషల్ మీడియా ప్రచారానికి తెరతీసింది. దీంతో సహజంగానే.. విశాఖలో కలకలం రేగింది.
గంటా ఇవాళ కాకపోతే రేపైనా వైసీపీలో చేరతారనే సంకేతాలు బలంగానే కనిపిస్తున్నాయి. గంటా వచ్చినా, ఇంకెవరైనా వస్తామన్నా కూడా జగన్ రాజీనామా అడుగుతున్నారు. అందుకే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, జగన్ కి జై కొట్టినా తాము మాత్రం నేరుగా వైసీపీ కండువా కప్పుకోలేదు.
తమ కొడుకుల్ని, అనుచరుల్ని వైసీపీలో చేర్చి వారింకా టీడీపీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. ఒకవేళ గంటా వైసీపీలోకి వస్తున్నా.. ఈ మధ్యే మార్గాన్ని కొనసాగిస్తారు కానీ, ఆయనకు పిలిచి మరీ కిరీటం పెట్టరు.
విశాఖ నాలుగు దిక్కులూ తమవేనంటూ విర్రవీగుతున్న టీడీపీ ఇటీవలే ఓ దిక్కు కోల్పోయింది. వాసుపల్లి గణేష్ ఇటీవలే వైసీపీ గూటికి వచ్చారు. ఇప్పుడు గంటా కూడా చేజారబోతున్నారనే బాధలో టీడీపీకి చెందిన కొన్ని సోషల్ మీడియా పేజీలు కట్టుకథలు అల్లుతున్నాయి.. వైసీపీలో వైషమ్యాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి..
గంటా నేరుగా వచ్చినా, రాజీనామా చేసి వచ్చినా, రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలిచి వచ్చినా కూడా జగన్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కుదిరే పని కాదు. తనని నమ్ముకుని ఉన్నవారిని పక్కనపెట్టి, కొత్తగా వచ్చినవారిని అందలమెక్కించడం జగన్ కి చేతకాదు. గతంలో చంద్రబాబు చేసిన తప్పుని జగన్ ఎన్నటికీ చేయరు, చేయబోరు.