చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం గుర్తుందా.. రాష్ట్ర విభజన టైమ్ లో రెండు కళ్ల సిద్ధాంతం అంటూ ఆయన ఆడిన డ్రామాలు గుర్తుచేయమంటారా? తనకు తెలంగాణ, ఏపీ రెండు కళ్లు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు బాబు.
ఓవైపు విభజనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇస్తూనే, మరోవైపు రెండు కళ్లు అంటూ కపటనాటకం ఆడారు. ఏదైతేనేం ఆయన నాటకం అప్పట్లో రక్తికట్టింది. ఏపీ ప్రజలు అధికారం అప్పగించారు.
అయితే బాబు అసలు రంగు ఏంటనేది త్వరగానే తెలుసుకున్నారు ఏపీ ప్రజలు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి తన మనుషులు, తన సామాజిక వర్గం బాగు కోసమే అహర్నిశలు శ్రమించిన బాబు.. అందుకు ఫలితం అనుభవించారు.
అతితక్కువ సీట్లతో దాదాపు తట్టాబుట్టా సర్దేశారు. అయితే తనకు, తన పార్టీకి ప్రజలు ఇంత బుద్ధిచెప్పినా కూడా బాబు తన రెండుకళ్ల సిద్ధాంతాన్ని వీడలేదు. అయితే ఈసారి దీన్ని రెండు కళ్ల సిద్ధాంతం అనకూడదు. రెండు నాల్కల నాటకం అనాలేమో.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపకూడదని, కరోనా తీవ్రస్థాయిలో ఉందని అంటారు చంద్రబాబు. స్వయంగా ఆయనే గతంలో జూమ్ లో అన్నమాటలివి.
ఓవైపు అలా కలరింగ్ ఇస్తూనే, మరోవైపు అచ్చెన్నాయుడితో ఎన్నికలు జరగాల్సిందేనంటూ డిమాండ్ చేసేలా స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. అంటే ఒకే అంశంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఒకలా, రాష్ట్ర అధ్యక్షుడు దానికి పూర్తి భిన్నంగా స్పందిస్తున్నారన్నమాట. ఇదే కదా రెండు నాల్కల సిద్ధాంతం అంటే.
కరోనా సెకెండ్ వేవ్ మొదలయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని ఆసియా దేశాలతో పాటు యూరోప్ దేశాల్లో ఆంక్షలు విధించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ సుద్దులు చెబుతారు బాబు.
ఆ విధంగా ప్రజల దృష్టిలో తానొక పెద్దమనిషిని అన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటారు. కట్ చేస్తే, మరోవైపు తన రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం అచ్చెన్నాయుడుతో ఎన్నికలు జరిపించాల్సిందిగా ప్రకటనలు గుప్పిస్తారు. చూశారుగా.. ఇదీ టీడీపీ నిస్సిగ్గు రాజకీయం. చేతిలో ఎన్నికల కమిషనర్ ను పెట్టుకొని ఇలా ఇష్టమొచ్చినట్టు, నాటకాలు షురూ చేశారు చంద్రబాబు-అచ్చెన్నాయుడు.
ఏపీలో కరోనా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదని, ప్రజలతో పాటు మంత్రులు కూడా కరోనా బారిన పడ్డారని, కాబట్టి ఎన్నికల్ని ఇప్పట్లో జరపడం సాధ్యంకాదని ప్రభుత్వం ఈసీకి చెబితే.. అది నిజమే అన్నట్టు పరోక్షంగా స్పందిస్తారు బాబు. అచ్చెన్నాయుడు మాత్రం వితండవాదం అంటారు. ఎన్నికలకు భయపడే జగన్ సర్కార్ వెనక్కి తగ్గుతోందని మేకపోతు గాంభీర్యం చూపిస్తారు.
వాస్తవంగా మాట్లాడుకుంటే, ఎన్నికలకు భయపడాల్సింది ఎవరు? సంక్షేమమే ధ్యేయంగా దూసుకుపోతున్న జగన్ ను చూసి బడుగు-బలహీన వర్గాలు, రైతులు పొంగిపోతున్నారు. ఇన్నాళ్లూ టీడీపీ జెండా మోసిన వ్యక్తులకు కూడా రైతుభరోసా, పింఛన్లు, ఆసరా అంటూ డబ్బులు చేతిలో పెడుతుంటే.. గెలుపుపై టీడీపీకి ఇంకా ఆశ ఉందా? అంతెందుకు, కరోనా విజృంభించక ముందే ఎన్నికల కోసం ప్రభుత్వం సమాయత్తం అవుతున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఏకగ్రీవాలు వచ్చాయో అందరం చూశాం.
లెక్కలన్నీ ఓవైపు ఇలా జగన్ కు అనుకూలంగా కనిపిస్తుంటే, మరోవైపు టీడీపీ మాత్రం వాటి వైపు కన్నెత్తి చూడడం లేదు. జగన్ వేవ్ ఓ రేంజ్ లో ఉందనే భయం మనసులో ఉన్నప్పటికీ, పైకి మాత్రం ఎన్నికలపై అస్తవ్యస్థ ప్రకటనలు చేస్తున్నారు. బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడగొట్టిందనే సినిమా డైలాగ్ ను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవచ్చేమో.