రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించి నిన్న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ఇచ్చిన తీర్పుతో సీమ కన్నీళ్లు పెడుతుంటే, ఆంధ్రజ్యోతిలో మాత్రం ఆనంద భాష్పాలు చూడొచ్చు. బహుశా ఒక నాయకుడిపై కోపంతో వెనుకబడిన ప్రాంతాన్ని ద్వేషిస్తూ రాతలు రాయడం జర్నలిజం చరిత్రలో ఒక్క ఆంధ్రజ్యోతికే సాధ్యమైందని చెప్పొచ్చు.
జర్నలిజం నైతిక విలువలకే మచ్చ తెచ్చేలా ఆంధ్రజ్యోతి రాతలు ఉన్నాయనేందుకు నేడు ఆ పత్రిక ప్రచురించిన వార్తా కథనం పరాకాష్టగా చెప్పొచ్చు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగునీటిని అందించేందుకు జగన్ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
ఈ మేరకు అందుకు తగ్గ చర్యలు వేగవంతం చేసింది. అయితే ఈ పథకంపై అభ్యంతరం చెబుతూ తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.రామకృష్ణన్, సభ్య నిపుణుడు సైబల్ దాస్ గుప్తాతో కూడిన ట్రైబ్యునల్ ద్విసభ్య ధర్మాసనం గురువారం తుది తీర్పు వెలువరించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతే ముందుకెళ్లాలని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని ఎన్జీటీ ఎక్కడా ఆదేశించలేదు. పర్యావరణ అనుమతులు తీసుకునేందుకు కొంత సమయం పడుతుందే తప్ప, అదేమీ నిలిచిపోయేది కాదు.
ఇదొక చిన్న అడ్డంకి మాత్రమే. కానీ ఆంధ్రజ్యోతి ఈ వార్తను రాసిన విధానం చూస్తే …సీమ ప్రాంతంపై ఎంత అక్కసుతో ఉందో అర్థమవుతుంది. ‘సీమకు బ్రేక్’ శీర్షికతో బ్యానర్ కథనాన్ని రాసుకొచ్చింది. అలాగే ఈ తీర్పు నేపథ్యంలో ఆంధ్రజ్యోతి మరో అనుబంధ కథనాన్ని కూడా రాసింది. ‘ఇది కేంద్రం ఇచ్చిన షాక్’ శీర్షికతో తన్మయ త్వం చెందుతూ ఆంధ్రజ్యోతి ఆసక్తికర కథనాన్ని రాసుకొచ్చింది. ఇక కథనంలో వెళితే …
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం మరో షాకిచ్చింది. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలను రూ.20,398 కోట్లకు పరిమితం చేసి కేంద్ర ఆర్థిక శాఖ దిగ్ర్భాంతిపరచగా.. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) నిలిపివేయడానికి కేంద్ర జలశక్తి శాఖ కారణమని స్పష్టమైంది.
సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించి.. కేంద్ర జల సంఘం, పర్యావరణ అనుమతులు తీసుకుంటే తప్ప ఈ స్కీమును ఆమోదించవద్దని ఎన్‌జీటీకి జలశక్తి శాఖ సూచించడంతోనే దీనికి బ్రేకులు పడ్డాయి’ అని ఆనందపారవశ్యంలో ఆంధ్రజ్యోతి అక్షరాలు కదం తొక్కాయి.
ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం తీసుకున్నా ….ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాదు ….కరవుతో అల్లాడుతున్న రాయలసీమ ప్రజానీకానికి షాక్ అవుతుంది. రాయలసీమకు కేంద్రం ఏ విధంగా మోసం చేస్తున్నదో రాయడానికి బదులు, అదేదో జగన్‌కు కోలుకోలేని దెబ్బ అన్నట్టు ఆంధ్రజ్యోతి రాసిన తీరు… ఆ పత్రిక హ్రస్వ దృష్టికి నిదర్శనం.
ఆంధ్రజ్యోతి సంకుచిత్వానికి ఈ కథనమే నిలువెత్తు సాక్ష్యం. ఐదేళ్లకో సారి ప్రభుత్వాలు మారుతుంటాయి. పాలకులను దృష్టిలో పెట్టుకుని విధానాలు ఉంటే అంతిమంగా ప్రజలే బలి పశువులు అవుతారు.
ఇప్పుడు జగన్‌పై అక్కసుతో కేంద్రం చేస్తున్న అన్యాయం గురించి ప్రశ్నించకపోతే , మోడీ సర్కార్‌తో పాటు ప్రశ్నించని మీడియా సంస్థలు, పాలకులు కూడా ప్రజాకోర్టులో దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ఇదే కథనంలో గత పాలకుల వంచనను చూడొచ్చు.
‘ 2013-14 అంచనాల ప్రకారం.. పోలవరం మొత్తం వ్యయం రూ.20,398.61 కోట్లేనని 2017 మార్చి 15న తీర్మానించిన కేంద్ర కేబినెట్ నోట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ బయటకు తీసి.. అంతే మొత్తం ఇస్తామని.. దీనికి అంగీకరిస్తేనే రాష్ట్రప్రభుత్వం పెట్టిన ఖర్చును రీయింబర్స్ చేస్తానని షరతు విధించిన సంగతి తెలిసిందే. దీంతో పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ అయోమయంలో పడింది. ఇప్పుడు ఎన్‌జీటీ తీర్పుతో సీమ ఎత్తిపోతల పథకానికీ గ్రహణం పట్టినట్లయింది’
పోలవరం మొత్తం వ్యయాన్ని రూ.20,398.61 కోట్లేనని 2017, మార్చి 15న కేంద్రం తీర్మానించిన సమయంలో …మోడీ కేబినెట్‌లో టీడీపీ సభ్యులు మంత్రులుగా ఉన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన, చేస్తున్న ద్రోహంలో టీడీపీ భాగస్వామ్యం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. నాడు చంద్రబాబు కేంద్రంతో చేసుకున్న లోపాయికారి ఒప్పందం వల్ల నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది.
ఈ వాస్తవాన్ని ఆంధ్రజ్యోతి దాచి పెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటి? లోకం కళ్లకు గంతలు కట్టి, చంద్రబాబు ద్రోహం గురించి ఎవరికీ తెలియకుండా చేయాలని ఆంధ్రజ్యోతి ఆరాటపడొచ్చు. కానీ ఆ పప్పేలేమీ ఉడకవని తెలుసుకుంటే మంచిది.
ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేసిన చంద్రబాబును నెత్తిన మోస్తూ … ఇప్పుడు ఆ విషయమై మోడీ సర్కార్‌ను జగన్ ఎందుకు నిలదీయం లేదని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. కరవు పీడిత ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్లాలని జగన్ సంకల్పిస్తే … దానికి ఎన్జీటీలో చిన్న అడ్డంకి ఏర్పడితే ఆంధ్రజ్యోతి జెజ్జనక తొక్కడం ఏంటి? ఒకవేళ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శాశ్వతంగా అడ్డంకి ఏర్పడితే నష్టపోయేది ఆ ప్రాంత ప్రజలే తప్ప జగన్ కాదు.
ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా, సేవ చేసే అవకాశం వచ్చిన నేతగా నీళ్లు ఇవ్వాలనుకోవడం ఆంధ్రజ్యోతి దృష్టిలో నేరమైందా? జగన్‌పై అక్కసు …కరవుతో అల్లాడుతున్న రాయలసీమ సమాజంపై విద్వేషం వెళ్లగక్కేంత విషాన్ని ఆంధ్రజ్యోతి అక్షరాలు నింపుకోవడం గమనార్హం.