పవన్ Vs నాగ్.. టికెట్ రేట్లపై ట్రోలింగ్

బంగార్రాజు సినిమా ఫంక్షన్లో టికెట్ రేట్లపై స్పందించను, రాజకీయాలు మాట్లాడనంటూ నాగార్జున సున్నితంగా తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఒక్క పాయింట్ తో ట్విట్టర్ అట్టుడికి పోయింది. దాన్ని పట్టుకుని పవన్ ని…

బంగార్రాజు సినిమా ఫంక్షన్లో టికెట్ రేట్లపై స్పందించను, రాజకీయాలు మాట్లాడనంటూ నాగార్జున సున్నితంగా తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఒక్క పాయింట్ తో ట్విట్టర్ అట్టుడికి పోయింది. దాన్ని పట్టుకుని పవన్ ని ట్రోల్ చేసినవారు కొందరయితే, ఆ ట్రోలింగ్ ని బేస్ చేసుకుని నాగార్జునని ఆటాడేసుకున్నారు మరికొందరు.

నాగ్ కి ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేదా..?

ఏ ప్రశ్నకు సమాధానం చెప్పాలి, ఏ ప్రశ్నకు ఎప్పుడు బదులివ్వాలి అనేది అడిగినవారి ఇష్టం కాదు, సమాధానం చెప్పాల్సినవారి హక్కు. అందుకే నాగార్జున సినిమా వేదికలపై రాజకీయాలు వద్దు అన్నారు. తన సినిమాకి వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పారు. దీంతో కొంతమంది ఈ ఆన్సర్ ని పవన్ కల్యాణ్ కి ట్యాగ్ చేశారు.

చూడు చూడు పవన్, నాగార్జున అన్నది నిన్నేనంటూ పవన్ అభిమానుల్ని రెచ్చగొట్టారు. నాగార్జున లాగా సంస్కారం ఉండాలని, ఆమధ్య రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో పవన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. వైసీపీ అభిమానులు, సానుభూతి పరులు కూడా ఇందులో భాగమయ్యారు. టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న వేళ, నాగార్జున స్టేట్ మెంట్ ని వాడుకుంటూ.. వారు పవన్ ని బాగా టార్గెట్ చేశారు, ట్రోల్ చేశారు.

రెచ్చిపోయిన పవన్ అభిమానులు..

నాగార్జున ఎక్కడా తన ప్రసంగంలో రామ్ గోపాల్ వర్మ పేరు కానీ, పవన్ పేరు కానీ ప్రస్తావించలేదు. కానీ పవన్ అభిమానులు మాత్రం నాగార్జునని ఓ ఆటాడేసుకున్నారు. ఏపీ ప్రభుత్వానికి నాగ్ భయపడ్డారని, అందుకే సినిమా టికెట్ రేట్ల గురించి సినిమా ఫంక్షన్లో ప్రస్తావించడానికి కూడా ఇబ్బంది పడ్డారని ట్రోలింగ్ మొదలు పెట్టారు. టికెట్ రేట్లు తగ్గించినా తనకేమీ ఇబ్బంది లేదంటూ నాగార్జున సరెండర్ అయిపోయారంటూ కామెంట్లు విసిరారు.

నాగార్జున వ్యాఖ్యలకి పవన్ కల్యాణ్ ని ట్యాగ్ చేయడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇదంతా. వాస్తవానికి నాగార్జున సమాధానంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. టికెట్ రేట్లపై మాట్లాడటం, మాట్లాడకపోవడం ఆయన ఇష్టం. పైపెచ్చు ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు. రేట్లు తగ్గించడం వల్ల తన సినిమాకు వచ్చిన ఇబ్బంది లేదని క్లియర్ గా చెప్పారు.

దీనికి పవన్ అభిమానులు మాత్రం నెట్టింట వీరంగం వేశారు. భుజాలు తడుముకున్నారు. సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు అనే మాట వచ్చే సరికి.. అందరూ గుమ్మడికాయల దొంగల్లా మారిపోయారు. అలాంటి తలతిక్క పనులు చేసింది, చేసేది పవన్ ఒక్కరే కాబట్టి అభిమానులు ఆ స్థాయిలో రియాక్ట్ అయ్యారు. అయితే అనుకోకుండా ట్రోలింగ్ కి బలైపోయింది మాత్రం నాగార్జున. చెప్పను బ్రదర్ అంటూ అప్పట్లో అల్లు అర్జున్, పవన్ అభిమానులకి ఎలా బుక్కైపోయారో.. ఇప్పుడు కూడా మాట్లాడను బ్రదర్ అంటూ నాగార్జున అలాగే ఇరుక్కుపోయారు.