దేశంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కరోనా కేసుల గురించి పలు సందేహాలు జనిస్తూ ఉన్నాయి. దాదాపు నెలన్నర కిందట దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ ఫలితంగానే ప్రస్తుతం కేసులు పెరుగుతున్నాయా? లేక దేశంలో ఇది వరకూ ప్రభావం చూపిన డెల్టా రకం కరోనా వల్లనే ఇప్పుడు మళ్లీ కేసులు వస్తున్నాయా? అనేది అంతుబట్టని అంశంగా ఉంది.
గత వారం నుంచి ఇప్పటి వరకూ నిర్ధారణ అయిన కేసుల్లో ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య రెండు మూడు వేలలోపే ఉందని ప్రభుత్వ అధికారిక ప్రకటనలను బట్టి తెలుస్తూ ఉంది. ఒమిక్రాన్ వల్ల ఇండియాలో ఇప్పటి వరకూ ఒకరు మరణించారని, అధికారికంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెండు వేల పైనే అని ప్రభుత్వ అధికారిక ప్రకటనల ద్వారా తెలుస్తోంది! మరి ఒమిక్రాన్ కేసులు రెండు వేల స్థాయిలోనే అంటే.. గత రెండు రోజుల్లో వచ్చిన లక్షకు పైగా కరోనా కేసులు ఏ వేరియెంట్ వి అనుకోవాలి? అనేది పెద్ద ప్రశ్న.
గత 48 గంటల్లోనే లక్షకుపైగా కరోనా కేసులు వచ్చాయి దేశంలో. అలాంటప్పుడు వీటిల్లో ఒమిక్రాన్ కేసులు రెండు వేలే.. అని అధికారికంగా ఎలా నిర్ధారించారో మరి! ఒకవేళ లక్షకు పైగా కేసుల్లో ఒమిక్రాన్ వి కచ్చితంగా రెండు వేలే అయితే… మిగతావి ఏ వేరియెంట్! అలాంటప్పుడు ఇండియాలో ఒమిక్రాన్ కన్నా, పాత వేరియెంటే ప్రమాదకారిగా కొనసాగుతూ ఉందా?
ఒకవేళ ఒమిక్రాన్ కేసులు రెండు వేలే అయితే, మిగిలిన కేసులు.. పాత వేరియెంట్ వే అయితే, మరి గత రెండు మూడు నెలలుగా విశ్రమించిన పాత వేరియెంట్ కరోనా, సరిగ్గా ఇప్పుడే ఎలా మళ్లీ విజృంభిస్తోంది? దీనికి శాస్త్రీయమైన కారణాలు ఏమైనా ఉన్నాయా?
లక్షకు పైగా కేసుల్లో ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు రెండు వేలే అయితే, ఇప్పుడు మూడో వేవ్ కు కచ్చితంగా కారణం ఒమిక్రాన్ కానట్టే! పాత వేరియెంటే మళ్లీ తిరగబెడుతోంది! అని అనుకోవాలి. కానీ.. నిర్దారణ అయిన ప్రతి కరోనా కేసుకూ, ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షలు మళ్లీ జరుగుతున్నాయో, లేదో కూడా చెప్పే వారు ఎవరూ లేరు! కరోనా నిర్ధారణ అయిన తర్వాత దాని సీక్వెన్స్ పై పరీక్ష జరిగితే తప్ప.. ఒమిక్రాన్ నా కాదా, అనేది తేలదు కాబోలు!
ఒమిక్రాన్ తో మూడో వేవ్ అనుకుంటే.. ఇప్పుడు వస్తున్న కేసుల్లో ఒమిక్రాన్ వంతు రెండు మూడు శాతం! అలా కాదు పాత వేరియెంట్ తో మళ్లీ కేసులు వస్తున్నాయంటే.. దీనికి శాస్త్రీయమైన రీజన్ తెలియాలి. ఫస్ట్ వేవ్ తర్వాత రెండో వేవ్ రావడానికి ప్రధాన కారణం డెల్టా వేరియెంట్ అన్నారు. మరి ఇప్పుడు మూడో వేవ్ దాదాపు సాగుతున్నా… ఒమిక్రాన్ కేసుల లెక్క తేలింది రెండు మూడు శాతమే! ఇలా అధికారిక ప్రకటనలను పరిశీలిస్తే.. ఈ కరోనా కథేంటో అంతుబట్టదు. ఉన్నఫలంగా ఇలా ఎందుకు కేసులు పెరుగుతున్నాయో అర్థం కాదు.
ఇక్కడే మరో అంశం కూడా ఉంది. మొన్నటి వరకూ.. వైరల్ ఫీవర్లు విజృంభించాయి. జలుబులు, దగ్గులు.. గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు…. వీటితోనే వైరల్ ఫీవర్ల సింప్టమ్స్ బయటపడ్డాయి. అచ్చం కరోనా లక్షణాలే ఇవన్నీ. అయితే అప్పుడు కరోనా నిర్ధారణ పరీక్షలకు ఎవ్వరూ వెళ్లలేదు. డాక్టర్లు కూడా వైరల్ ఫీవర్లుగా తేల్చి మందులిచ్చి పంపేశారు. ఇప్పుడు ఒమిక్రాన్ భయం నేపథ్యంలో.. జలుబు రాగానే కరోనా టెస్టు చేయించడం తప్పనిసరిగా మారింది! మరి టెస్టుల అవసరం తప్పనిసరి అయ్యాకా.. ఏమైనా కేసుల సంఖ్య ఇలా పెరుగుతోందా? ఒకవేళ కొన్నాళ్ల కిందటి వరకూ విజృంభించిన వైరల్ ఫీవర్ల సమయంలో కూడా కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేసి ఉంటే.. ఎన్ని కేసులు నిర్ధారణ అయ్యేవి?
అలాగని ఇప్పుడు వస్తున్న కేసులను తక్కువ చేయలేం కానీ, ఒమిక్రాన్ కేసులకూ, మొత్తం కరోనా కేసులకూ సంబంధం కనిపించకపోవడంతోనే.. బోలెడన్ని అనుమానాలు, సందేహాలు తలెత్తుతున్నాయి. మరి వీటికి క్లారిటీ ఇచ్చే పరిశోధకులు ఎవరో!