దాదాపు మూడేళ్ల కిందట మలయాళంలో వచ్చిన 'జోసెఫ్' సినిమా తెలుగు రీమేక్ 'శేఖర్' విడుదలకు దాదాపు సిద్దం అవుతున్నట్టుగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి చిన్న స్పాయిలర్ ఏమిటంటే, కొన్నాళ్ల కిందట జోసెఫ్ ను అమేజాన్ లో విడుదల చేశారు. అక్కడకూ రాజశేఖర్ సినిమా మలయాళీ వెర్షన్ కు రీమేక్ అనే ప్రచారం జరిగింది తక్కువే. కానీ, రాజశేఖర్ కు సంబంధించిన లుక్ తో ఈ సినిమాపై అందరి అటెన్షన్ వచ్చింది. ఇది జోసెఫ్ కు అధికారిక రీమేక్ అని స్పష్టం అయ్యింది.
ఈ నేపథ్యంలో అందరి దృష్టీ జోసెఫ్ మలయాళీ వెర్షన్ మీద పడింది. కథా పరంగా.. కొంత సినిమాటిక్ ఉన్నా… జోసెఫ్ ఒక స్టన్నింగ్ స్క్రీన్ ప్లే! అడుగడుగునా ఆశ్చర్యకరమైన మలుపులతో సాగుతుంది. ఎన్నో రకాల ఎమోషన్లతో ప్రేక్షకుడిని సినిమాలోకి లీనం అయ్యేలా చేస్తుంది. జీవితంలోని ప్రతి మలుపులోనూ విషాదాన్ని మోసే వ్యక్తి కథే అయినా… చెప్పే విధానం ఆద్యంత భావోద్వేగంగానే సాగినా, ఎక్కడా ఏదో ప్యాథటిక్ సినిమాను, విపరీతమైన సెంటిమెంట్ సినిమాను చూస్తున్నట్టుగా అనిపించదు.
పోలీస్ శాఖలో పని చేసి, ఇన్వెస్టిగేషన్ కు పేరెన్నిక గన్న వ్యక్తి జోసెఫ్. రిటైర్డ్ అయినా.. పాత పరిచయాలతో పోలీసులకు తన సహకారం అందిస్తూ ఉంటాడు. నెలల తరబడి విచారణ జరిగినా తేలని క్రైమ్ కేసులను ఇట్టే పరిష్కరించగలిగిన జోసెఫ్ కు సమాజంలో మంచి గౌరవమర్యాదలుంటాయి. స్నేహితులే లోకంగా గడిపే జోసెఫ్ జీవితంలో.. ప్రేమ, ఆనందం, విషాదం.. వరసలా సాగుతూ ఉంటుంది.
ఎన్నో క్రైమ్ కేసులను తన పరిశీలనతోనే పరిష్కరించిన జోసెఫ్ కు తన జీవితంలోనే అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఈ కేసు పరిష్కారం మాత్రం అంత తేలికగా జరగదు. మరి అలాంటి కేసును జోసెఫ్ ఎలా పరిష్కరించుకున్నాడనే తీరు.. విస్మయాన్ని కలిగిస్తుంది.
ఒక వ్యక్తి జీవితాన్ని ఒక మాఫియా ఎలా మార్చేసింది. ఒక పెద్ద మాఫియాను తెలివితేటలున్న ఒక సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశం ఆకట్టుకుంటుంది. మలయాళీ సినిమాలకు సహజమైన ఆభరణమైన షార్ప్ స్క్రీన్ ప్లే జోసెఫ్ ను తప్పక చూడాల్సిన సినిమాగా నిలిపింది. ఐఎండీబీలో ఈ సినిమాకు 8 ప్లస్ రేటింగ్ ఉంది. విడుదలైన మూడేళ్ల తర్వాత కూడా ఇలాంటి రేటింగ్ ను కొనసాగించడం అంటే తేలికేమీ కాదు.
సినిమా ఆద్యంతాన్నీ జోజూ జార్జ్ ఒంటి చేత్తో నడిపించాడు. తన కనుచూపుతో కూడా నటించగల ఈ నటుడు.. ఇప్పటికే మలయాళీ సూపర్ హిట్ సినిమాలతో బయటి వారికి పరిచయం అయ్యాడు. మాలిక్, నయట్టు.. వంటి సినిమాల్లో జోజూ జార్జ్ గుర్తుండిపోతాడు. జోసెఫ్ ను చూస్తే… ఇతడిలోని అత్యుత్తమ నటుడు మరింతగా పరిచయం అవుతాడు.
ఈ సినిమాలో తన నటనకు గానూ జోజూ కేరళ స్టేట్ అవార్డును పొందడమే కాదు, జాతీయ అవార్డుల్లో స్పెషల్ మెన్షన్ ను పొందాడు. అంతలా జోసెఫ్ గా జీవించాడు జోజూ. ఇప్పటికే దృశ్యం తరహాలో ఈ సినిమా కన్నడ, తమిళ భాషల్లో రీమేక్ అవుతోంది. కన్నడలో రవిచంద్రన్ ఈ సినిమాను చేస్తున్నాడు. తెలుగులో రాజశేఖర్ టైటిల్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇలాంటి పాత్రలను పండించగల సత్తా రాజశేఖర్ కు పుష్కలంగా ఉందని వేరే చెప్పనక్కర్లేదు.
అయితే .. సినిమా చూశాకా.. కొన్ని సందేహాలు మిగిలిపోతాయి. స్టన్నింగ్ స్క్రీన్ ప్లేనే అయినా.. మూల కథ విషయంలో కాస్త సినిమా టిక్ గా వెళ్లారేమో అనిపిస్తుంది. అంధాధూన్ సినిమా సెకెండ్ హాఫ్ లో అసంమజసంగా అనిపించే అంశమే, జోసెఫ్ విషయంలోనూ పంటికింద రాయిలా తగులుతుంది. కానీ.. స్క్రీన్ ప్లే విషయంలో జోసెఫ్ ఒక పాఠం రేంజ్ లో నిలుస్తూ, ఆ లోపాన్ని అధిగమిస్తుంది.
ఇక మలయాళీ వెర్షన్ లోని మరో ప్రత్యేకమైన అంశం.. మ్యూజిక్. ఇలాంటి సినిమా విషయంలో మంచి మ్యూజిక్ ను ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయరేమో! సినిమా చూశాకా.. యూట్యూబ్ లో వెదుక్కొని మరీ ఈ మలయాళీ సినిమా పాటలు వినాలనిపించేంత స్థాయిలో ఉంటాయి. సున్నితమైన, గాఢమైన భావోద్వేగాలతో, ఆహ్లాదంగా, మనసును తాకేలా సాగే కంప్లీట్ ప్యాకేజీ జోసెఫ్. తెలుగులో కూడా అవే ఎమోషన్స్ క్యారీ అయితే, రాజశేఖర్ ఖాతాలో మంచి సినిమా పడటం ఖాయం.